Risk of Breast Cancer : రొమ్ము క్యాన్సర్ ముప్పునకు ఇవే కారణమట.. నిపుణులు ఏమంటున్నారంటే..?
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న మహమ్మారి రొమ్ము క్యాన్సర్ (Breast Cancer). ప్రతి ఏటా సుమారు 7,75,000 మంది ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ వ్యాధి, గతంలో వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించేది. కానీ, మారుతున్న కాలంతో పాటు ఇప్పుడు యువతుల్లోనూ ఈ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ క్యాన్సర్ సదస్సులో నిపుణులు వెల్లడించిన అంశాలు వైద్య సమాజంలో సరికొత్త చర్చకు దారితీశాయి. మహిళల కెరీర్, మారుతున్న జీవనశైలితో పాటు మాతృత్వాన్ని ఆలస్యం చేయడం కూడా రొమ్ము క్యాన్సర్‌కు ఒక ప్రధాన కారణం కావచ్చని ఆంకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
ఆలస్యంగా మాతృత్వం.. హార్మోన్ల ప్రభావం..!
మహిళలు విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తూ 30 ఏళ్లు దాటిన తర్వాతే పిల్లలను కనడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ ఆలస్యం శరీరం సహజ జీవ ప్రక్రియలపై ప్రభావం చూపుతుందని ఇటలీలోని గలేరియా హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ ఆండ్రియా డెసెన్సీ స్పష్టం చేశారు.
గర్భం దాల్చే వరకు మహిళల్లో రొమ్ము కణాలు సాపేక్షంగా అపరిపక్వంగా, సున్నితంగా ఉంటాయి. ఇవి శరీరంలోని 'ఈస్ట్రోజెన్' అనే హార్మోన్ ప్రభావానికి ఎక్కువగా గురవుతాయి.సరైన వయసులో 20 నుంచి 35 ఏళ్ల లోపు గర్భం దాల్చినప్పుడు ఈ కణాలు త్వరగా పరిపక్వం చెంది పాలు ఉత్పత్తి చేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఇది సహజంగానే క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.
60 శాతం పెరిగే ప్రమాదం: 'బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్' అధ్యయనం ప్రకారం.. 22 ఏళ్ల వయసులో మొదటి బిడ్డను కన్న మహిళలతో పోలిస్తే, 30 ఏళ్లు దాటిన తర్వాత మాతృత్వం పొందిన వారిలో మెనోపాజ్‌కు ముందు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 60శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే ప్రతి తదుపరి గర్భంతో ఈ ప్రమాదం 9శాతం వరకు తగ్గుతుందని పరిశోధనలు చెప్తున్నాయి.
రక్షణ కవచంగా 'తల్లిపాలు'..
రొమ్ము క్యాన్సర్ నివారణలో తల్లిపాలు ఇవ్వడం (Breastfeeding) ఒక అద్భుతమైన రక్షణ కవచంలా పనిచేస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆరు నెలలకు పైగా పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. క్యాన్సర్ కణాలు పెరగడానికి ఈస్ట్రోజెన్ తోడ్పడుతుంది కాబట్టి, తల్లిపాలు ఇవ్వడం ద్వారా ఆ హార్మోన్ ఉత్పత్తి తగ్గి, వ్యాధి వచ్చే ప్రమాదాన్ని దాదాపు 10 ఏళ్ల పాటు వాయిదా వేయవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
జాగ్రత్తలు.. నివారణోపాయాలు..
క్యాన్సర్ అనేది అనేక సంక్లిష్ట కారణాల వల్ల వస్తుందని, కేవలం పిల్లలను కనే నిర్ణయం పైనే ఇది ఆధారపడి ఉండదని 'క్యాన్సర్ రీసెర్చ్ యూకే' ఆరోగ్య సమాచార విభాగాధిపతి ఫియోనా ఓస్బోర్న్ పేర్కొన్నారు. పిల్లలను ఎప్పుడు కనాలనేది వ్యక్తిగత నిర్ణయమైనప్పటికీ, ఈ క్రింది జాగ్రత్తల ద్వారా క్యాన్సర్ ముప్పును మెజారిటీ శాతానికి తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు:
బరువు నియంత్రణ..
ఊబకాయం రాకుండా చూసుకోవడం, శారీరక శ్రమ లేదా వ్యాయామం అలవాటు చేసుకోవడం. పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం. రొమ్ములో గడ్డలు, ఆకారంలో మార్పులు, లేదా చనుమొనల నుండి అసాధారణ స్రావాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం. రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి 30 ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉత్తమమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
