Jamun Fruit Benefits : రెండు నెలలు మాత్రమే లభించే 'నేరేడు'తో ఏడాది పొడవునా ఆరోగ్యం.. షుగర్, లివర్ పక్కా కంట్రోల్..!
సాక్షి లైఫ్ : వేసవి ముగిసి వర్షాకాలం ఆరంభమయ్యే తరుణంలో ప్రకృతి మనకు అందించే అమూల్యమైన కానుక 'నేరేడు పండు' (Jamun). సంవత్సరంలో కేవలం రెండు నెలలు మాత్రమే లభించే ఈ చిన్న పండు.. ఆరోగ్య పరంగా చేసే మేలు అంతా ఇంతా కాదు. పులుపు, తీపి, వగరు కలగలిసిన రుచితో నోరూరించే నేరేడు.. కేవలం నోటికి రుచినే కాదు, శరీరానికి కొండంత బలాన్ని ఇస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సీజన్‌లో దొరికే ఈ రెండు నెలలు క్రమం తప్పకుండా నేరేడు పండ్లను తింటే.. ఏడాది పొడవునా లివర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అద్భుతమైన పండ్లలో దాగున్న పోషకాల గని, వాటి వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలపై ప్రత్యేక కథనం మీకోసం..
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
పోషకాల భాండాగారం..
నేరేడు పండులో విటమిన్-సి, ఫైబర్ , పొటాషియం, ఐరన్ వంటి అవసరమైన పోషకాలతో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర కణాలు ఆక్సీకరణ ఒత్తిడి (Oxidative Stress) కి గురికాకుండా రక్షిస్తాయి.
1. ఆంథోసయనిన్ పవర్‌హౌస్..
నేరేడు పండుకు ఆ ముదురు ఊదా రంగును ఇచ్చేది అందులో ఉండే 'ఆంథోసయనిన్' అనే పిగ్మెంట్. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
లాభాలు: ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నిర్వీర్యం చేసి కణాల నాశనాన్ని అడ్డుకుంటుంది. తద్వారా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అలాగే, ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చూస్తుంది.
2. మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం..
షుగర్ వ్యాధితో బాధపడేవారికి నేరేడు పండు ఒక సంజీవని లాంటిది. కేవలం పండు మాత్రమే కాదు.. దీని గింజలు కూడా మధుమేహ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తాయని పలు అధ్యయనాలు నిరూపించాయి.
నేరేడులోని బయోయాక్టివ్ సమ్మేళనాలు గ్లూకోజ్ జీవక్రియను (Glucose Metabolism) మెరుగుపరుస్తాయి. అయితే, దీనిని మందులకు ప్రత్యామ్నాయంగా కాకుండా, ఆహారంలో భాగంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
3. కాలేయానికి రక్షణ.. జీర్ణక్రియకు మేలు..
నేరేడు పండ్లలో ఉండే సహజ సమ్మేళనాలు కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి లివర్‌ను శుభ్రం చేయడంలో ఇవి తోడ్పడతాయి.
మలబద్ధకానికి చెక్..
ఈ పండులో పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది. మధుమేహ రోగులలో తరచుగా కనిపించే మలబద్ధకం సమస్యను నివారించి, ప్రేగుల కదలికలను క్రమబద్ధం చేస్తుంది.
మరికొన్ని అదనపు ప్రయోజనాలు..
నేరేడు పండ్లలోని విటమిన్ సి వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. గుండె ఆరోగ్యం, బి.పి నియంత్రణ..నేరేడులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి, రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండ్లు తిన్నప్పుడు కడుపు నిండిన అనుభూతి కలిగి.. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. నేరేడు పండ్లను ఆరోగ్యానికి మంచివని అమితంగా కాకుండా, సీజన్ ఉన్నంత కాలం ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో తీసుకోవడం శ్రేయస్కరం. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
