Are You Using Plastic Bottles : ప్లాస్టిక్ వాడుతున్నారా..? బాటిల్స్ వెనుక ఉన్న ఈ నంబర్ల రహస్యం మీకు తెలుసా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు ప్లాస్టిక్ వస్తువులతోనే జీవనం సాగిస్తున్నాం. నీళ్ల సీసాలు, లంచ్ బాక్సులు, పాల ప్యాకెట్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు.. ఇలా ప్రతిదీ ప్లాస్టిక్‌తో ముడిపడి ఉంది. అయితే, మీరు వాడే ప్రతి ప్లాస్టిక్ వస్తువు అడుగు భాగంలో ఒక త్రిభుజం (Triangle) గుర్తు, దాని మధ్యలో 1 నుంచి 7 వరకు ఏదో ఒక నంబర్ ఉండటం గమనించారా..? ఆ నంబర్లను కేవలం ఏదో కోడ్ అనుకుంటే పొరపాటే..! అవి మీ ఆరోగ్య రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన హెచ్చరికలు. ఆ నంబర్ల అర్థం ఏంటి..? ఏ నంబర్ ఉన్న ప్లాస్టిక్ ఆరోగ్యానికి ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

ప్లాస్టిక్ నంబర్ల కోడ్స్.. వాటి వెనుక ఉన్న అసలు అర్థాలు..  

నంబర్ 1 (PET లేదా PETE - పాలిథిలిన్ టెరిఫ్తాలేట్)..

మనం తాగే మంచినీళ్ల బాటిళ్లు, కూల్ డ్రింక్ సీసాలు దీనితోనే తయారవుతాయి. ఇవి కేవలం ఒక్కసారి మాత్రమే (Single-use) వాడుకోవడానికి ఉద్దేశించినవి. వీటిని పదే పదే కడిగి వాడితే, అందులోని రసాయనాలు నీటిలో కరిగి శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.

నంబర్ 2 (HDPE - హై డెన్సిటీ పాలిథిలిన్)..

ఇది కాస్త మందంగా ఉండే సురక్షితమైన ప్లాస్టిక్. పాలు, జ్యూస్ బాటిళ్లు, షాంపూ సీసాలు, డిటర్జెంట్ డబ్బాల తయారీకి దీన్ని వాడతారు. దీనిని రీసైకిల్ చేయడం సులువు. ఆరోగ్య పరంగా ఇది సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.

నంబర్ 3 (PVC  పాలివినైల్ క్లోరైడ్)..

పైపులు, వైర్లు, పిల్లల బొమ్మలు, కొన్ని రకాల షాంపూ బాటిళ్లలో దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో ఉండే థాలేట్స్ వంటి రసాయనాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఆహార పదార్థాల కోసం దీనిని అస్సలు ఉపయోగించకూడదు.

నంబర్ 4 (LDPE - లో డెన్సిటీ పాలిథిలిన్)..

మనం వాడే క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ కవర్లు, పాల ప్యాకెట్లు, ల్యాబ్ పరికరాలు దీనితో తయారవుతాయి. ఇది కూడా ఆరోగ్య పరంగా పెద్దగా హాని చేయని సురక్షిత రకానికి చెందినదే కానీ, పర్యావరణానికి మాత్రం తీవ్ర నష్టం కలిగిస్తుంది.

నంబర్ 5 (PP - పాలిప్రొపిలీన్)..

ఇది అత్యంత సురక్షితమైన ప్లాస్టిక్. పెరుగు కప్పులు, మందుల సీసాలు, వంటింట్లో వాడే లంచ్ బాక్సులు, మైక్రోవేవ్ సేఫ్ గిన్నెలు దీనితోనే చేస్తారు. ఇది వేడిని తట్టుకోగలదు, రసాయనాలను అంత త్వరగా ఆహారంలోకి విడుదల చేయదు.

నంబర్ 6 (PS - పాలీస్టైరిన్)..

దీనినే మనం సాధారణంగా 'థర్మాకోల్' అంటాం. డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్లు, ప్యాకింగ్ మెటీరియల్స్ దీనితో తయారవుతాయి. ఇందులో వేడి వేడి టీ లేదా కాఫీలు తాగినప్పుడు, 'స్టైరిన్' అనే టాక్సిన్ ఆహారంలో కలిసి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

నంబర్ 7 (OTHER - ఇతర ప్లాస్టిక్‌లు)..

ఇప్పుడు చెప్పిన ఆరు రకాలు కాకుండా మిగిలిన ప్లాస్టిక్ మిశ్రమాలన్నీ ఈ కేటగిరీ కిందకు వస్తాయి. ముఖ్యంగా 'పాలీకార్బోనేట్ (PC)' ప్లాస్టిక్ ఇందులో ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన 'బిస్ఫినాల్-ఎ (BPA)' అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది.

ఏ రకమైన ప్లాస్టిక్‌లను దూరంగా ఉంచడం మంచిది..?

ప్లాస్టిక్ వస్తువులను కొనేటప్పుడు, ముఖ్యంగా ఆహార, పానీయాల అవసరాల కోసం ఎంచుకునేటప్పుడు కొన్ని నంబర్లను ఖచ్చితంగా దూరంగా పెట్టాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యానికి ముప్పు తెచ్చే నంబర్లు.. 3, 6, 7

నంబర్ 3 (PVC).. కాన్సర్ కారక రసాయనాలను విడుదల చేసే అవకాశం ఉన్నందున దీనికి దూరంగా ఉండాలి.

నంబర్ 6 (PS/థర్మాకోల్).. వేడి పదార్థాలు తగిలినప్పుడు ఇది విషపూరితంగా మారుతుంది.

నంబర్ 7 (OTHER).. ఇందులో ఉండే BPA శరీరంలో చేరితే సంతానలేమి సమస్యలు, గుండె జబ్బులు, మధుమేహం, హార్మోన్ల లోపాలకు దారితీస్తుంది.

అలాగే నంబర్ 1 (PET) బాటిళ్లను కార్లలో ఎండకు వదిలేయడం, వాటిని వేడి నీటితో కడిగి మళ్లీ మళ్లీ ఇంట్లో మంచినీళ్ల కోసం వాడటం తక్షణమే ఆపేయాలి.

 మరి ఏది సురక్షితం..?

ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడమే ఉత్తమ మార్గం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే మాత్రం కేవలం 4, 5, 2 నంబర్లు ఉన్న వస్తువులను మాత్రమే ఎంచుకోండి. వంటగదిలో ప్లాస్టిక్ డబ్బాల స్థానంలో గాజు, పింగాణీ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను వాడటం అలవాటు చేసుకుంటే క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.