శరీరంలోని మలినాలను తొలగించే జ్యూస్..
సాక్షి లైఫ్ : బూడిద గుమ్మడికాయను ఇంగ్లిష్ లో "యాష్ గార్డ్" అంటారు. దీనితో చేసిన స్వీట్ ను ప్రతి ఒక్కరూ రుచి చూసే ఉంటారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. బూడిద గుమ్మడికాయను మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ రసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..?
ఇది కూడా చదవండి.. సరిగ్గా బ్రష్ చేయడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..
బూడిద గుమ్మడి కాయ జ్యూస్ ప్రయోజనాలు..
వేసవిలో తినే కూరగాయల్లో బూడిద గుమ్మడికాయ కూడా ఉంటుంది. ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీని రసం శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో ఔషధాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు.
బాడీ డిటాక్సిఫికేషన్..
బూడిద గుమ్మడి కాయలో 95 శాతం నీరు ఉంటుంది. పీచు పుష్కలంగా ఉండడం వల్ల అనేక వ్యాధులను నిర్మూలిస్తుంది. ఇది చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
రక్తహీనతకు దివ్యౌషధం..
ఎర్ర రక్త కణాలను పెంచే గుణాలు గుమ్మడి జ్యూస్ లో ఉన్నాయి. శరీరంలో రక్తహీనతను నిరోధించడంలో ఉపయోగపడుతుంది. గుమ్మడి రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఉండదు.
శరీరాన్ని చల్లగా ఉంచడంలో..
వేసవి కాలంలో ఈ జ్యూస్ తాగితే ఎండదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చు. గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల చలువ చేస్తుంది. ఇందులో తగినంత మొత్తంలో నీరు ఉంటుంది. కాబట్టి శరీరం చల్లగా ఉంటుంది.
అసిడిటీ దూరం..
గుమ్మడి జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను బలంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. గట్ హెల్త్ ను మెరుగు పరుస్తుంది.
గుమ్మడి కాయ జ్యూస్ ఎలా తయారు చేయాలి..?
గుమ్మడికాయ జ్యూస్ ను తయారు చేయడానికి..ముందుగా పై తొక్కను లోపల ఉండే గింజలను తొలగించి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ముక్కలను జ్యూసర్ లేదా బ్లెండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అనంతరం ఈ పేస్ట్ ను శుభ్రమైన కాటన్ క్లాత్ ద్వారా ఫిల్టర్ చేసుకొని ఆ రసాన్ని తాగాలి. ఆరోగ్యానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రుచి కోసం చక్కెర వేయకూడదు. రుచి కోసం ఉప్పు, నిమ్మకాయ లేదా కొబ్బరి నీటిని కలుపవచ్చు. ఇందులో ఏమీ కలపకుండా తాగడం ద్వారానే మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి.. నోటి ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు-వాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
