Diabetes Risk : ఉదయం పరగడుపున బ్లడ్ షుగర్ ఎంత ఉండాలి..? డయాబెటీస్ ముప్పును ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : నేటి డిజిటల్ యుగంలో వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో మధుమేహం (Diabetes) ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలు (blood sugar levels) సాధారణ పరిమితి దాటి పెరుగుతున్నా చాలామందికి ఆ విషయం తెలియదు. ఈ వ్యాధి ముప్పును ముందే పసిగట్టడానికి ఉదయం పరగడుపున చేయించుకునే 'ఫాస్టింగ్ బ్లడ్ షుగర్' పరీక్ష ఎంతో కీలకం. అసలు ఆరోగ్యవంతమైన వ్యక్తికి పరగడుపున షుగర్ ఎంత ఉండాలి..? పిల్లలు, యువత, వృద్ధులకు వేర్వేరు ప్రమాణాలు ఉంటాయా..? ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ దశలను ఎలా గుర్తించాలో వివరంగా తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఉదయం పరగడుపున బ్లడ్ షుగర్ ఎంత ఉండాలి..?
కనీసం 8 గంటల పాటు ఏమీ తినకుండా, తాగకుండా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగొచ్చు. ఉదయం పూట చేసే రక్తపరీక్షను 'ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్' అంటారు. పెద్దవారిలో దీని విలువలు కింది విధంగా ఉంటాయి.
ఉదయం పరగడుపున (fasting blood sugar level) రక్తంలో చక్కెర స్థాయిలు 70 నుంచి 99 mg/dL మధ్య ఉంటే దానిని సాధారణ స్థితిగా (normal) పరిగణిస్తారు. ఒకవేళ ఈ విలువలు 100 నుంచి 125 mg/dL మధ్య నమోదైతే అది 'ప్రీ-డయాబెటిస్' దశగా, అంటే మధుమేహం వచ్చే ముప్పు పొంచి ఉందనడానికి ముందస్తు హెచ్చరికగా భావించాలి. ఇక రక్తంలో చక్కెర స్థాయి 126 mg/dL లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దానిని డయాబెటిస్ (Diabetes) ఉన్నట్లుగా గుర్తిస్తారు.
గమనిక ఒకసారి 126 దాటినంత మాత్రాన నిర్ధారణకు రాకుండా, వైద్యుల సూచన మేరకు మరోసారి పరీక్ష చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోవాలి.
వయసును బట్టి షుగర్ స్థాయిలు మారుతాయా..?
ఆరోగ్యవంతులలో సాధారణ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ప్రమాణాలు కేవలం వయసును బట్టి మారవు. అయితే, ఇప్పటికే మధుమేహం బారిన పడిన వారికి వారి వయసు, ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యులు వేర్వేరు నియంత్రణ లక్ష్యాలను నిర్దేశిస్తారు.
చిన్నపిల్లల్లోనూ సాధారణ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 70-99 mg/dL మధ్యే ఉండాలి. పిల్లల్లో తరచూ మూత్రానికి వెళ్లడం, విపరీతమైన దాహం, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించాలి.
18 నుంచి 40 ఏళ్ల వయసు వారిలోనూ 70 నుంచి 99 mg/dL సాధారణ స్థాయి. ఒకవేళ 100 నుంచి 125 mg/dL మధ్య ఉంటే దానిని 'ప్రీ-డయాబెటిస్' దశగా గుర్తించి జీవనశైలి మార్చుకోవాలి.
40 నుంచి 60 ఏళ్ల వయసులో మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉన్నా, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఉంటే క్రమం తప్పకుండా రక్తపరీక్షలు చేయించుకోవాలి.
60 ఏళ్లు దాటిన వారిలో బ్లడ్ షుగర్ నియంత్రణ లక్ష్యాలను వారి ఆరోగ్య పరిస్థితి, వాడుతున్న ఇతర మందులను బట్టి డాక్టర్లు నిర్ణయిస్తారు. కాబట్టి వైద్యుల సలహా లేకుండా మందుల డోసులో మార్పులు చేయకూడదు.
షుగర్ పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
మాటిమాటికీ దాహం వేయడం, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం.
తిన్న కాసేపటికే మళ్లీ విపరీతంగా ఆకలి వేయడం. కారణం లేకుండా వేగంగా బరువు తగ్గిపోవడం. నిరంతర అలసట, నీరసం, నిస్సత్తువగా అనిపించడం. కంటిచూపు మసకబారడం, దెబ్బలు లేదా గాయాలు త్వరగా మానకపోవడం.కొందరిలో ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చని గుర్తుంచుకోవాలి.
బ్లడ్ షుగర్ పెరగడానికి ప్రధాన కారణాలు..
చక్కెర పదార్థాలు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు వంటివి ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, వంశపారంపర్య చరిత్ర, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి, కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
నియంత్రణలో ఉంచుకోవడం ఎలా..?
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, వ్యాయామం చేయాలి. ఆహారంలో ఆకుకూరలు, తాజా కూరగాయలు, పప్పుధాన్యాలు, పీచు పదార్థం (fiber) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శీతల పానీయాలు, స్వీట్లు, కృత్రిమ చక్కెరలకు దూరంగా ఉండాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి, ప్రతిరోజూ కంటినిండా నిద్రపోవాలి. మధుమేహం నిర్ధారణ అయితే వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.
అత్యవసర వైద్య చికిత్స..
పరగడుపున పరీక్షించిన ప్రతిసారీ బ్లడ్ షుగర్ 126 mg/dL లేదా అంతకంటే ఎక్కువగా నమోదవుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఒకవేళ డయాబెటిస్ ఉన్నవారిలో వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, వేగంగా లేదా భారంగా శ్వాస తీసుకోవడం, విపరీతమైన మత్తు లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య చికిత్స అందించాలి.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
