Asthma effect : వింటర్ సీజన్లో ఆస్తమా ఎందుకు తిరగబెడుతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఆహ్లాదకరంగా ఉండే ఈ శీతాకాలం చాలామందికి ఇష్టమే అయినప్పటికీ.. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని సవాళ్లను విసురుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఆస్తమా (asthma), ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కాలం మరింత ఇబ్బందికరంగా మారుతుంది. చల్లని గాలి పీల్చగానే కొందరిలో విపరీతమైన దగ్గు, ఛాతీలో బిగుతుగా అనిపించడం, ఆయాసం వంటి లక్షణాలు మొదల వుతాయి. ఆస్తమా బాధితుల శ్వాసనాళాలు సహజంగానే ఎంతో సున్నితంగా, కొద్దిపాటి వాపుతో ఉంటాయి. చల్లని, పొడి గాలి తగలగానే ఇవి మరింతగా కుంచించుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో ఆస్తమా ముప్పును ఎలా తగ్గించుకోవాలో నిపుణుల సూచనల ఆధారంగా తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్‌ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

 

చలికాలంలో ఆస్తమా (asthma)ఎందుకు తిరగబెడుతుంది..?

శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడానికి కేవలం చలి మాత్రమే కాదు, మరెన్నో కారణాలు తోడవుతాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. చల్లని, పొడి గాలి..గాలిలో తేమ శాతం తగ్గి పొడిగా మారడం వల్ల శ్వాసనాళాల్లో చికాకు (Irritation) ఏర్పడి, కండరాలు బిగుసుకు పోతాయి. వాయు కాలుష్యం.. చలికాలంలో గాలి సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల దుమ్ము, ధూళి, వాహనాల పొగ భూమికి దగ్గరగానే నిలిచిపోతాయి. ఇవి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

వైరల్ ఇన్ఫెక్షన్లు.. ఈ సీజన్‌లో జలుబు, ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి. ఇవి ఆస్తమా అటాక్ రావడానికి ప్రధాన కారణమవుతాయి. ఇంట్లోని అలర్జీ కారకాలు.. చలికి తలుపులు, కిటికీలు మూసి ఉంచడం వల్ల ఇంట్లో దుమ్ము, బూజు (Mold), పెంపుడు జంతువుల వెంట్రుకల వల్ల అలర్జీ పెరిగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

ఆస్తమా బాధితులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? 

శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు చలికాలంలో తమ దినచర్యలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు. ఉదయాన్నే విపరీతమైన చలి, పొగమంచు ఉండే సమయంలోనూ, అర్థరాత్రి వేళల్లోనూ బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ముక్కు, నోటికి మఫ్లర్ లేదా స్కార్ఫ్ కట్టుకోవాలి. దీనివల్ల లోపలికి వెళ్లే గాలి కొంత వెచ్చబడి ఊపిరితిత్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది.

 లక్షణాలు లేవు కదా అని వైద్యులు సూచించిన ‘కంట్రోలర్’ లేదా ‘ప్రివెంటర్’ ఇన్‌హేలర్లను వాడటం ఆపకూడదు. క్రమం తప్పకుండా మందులు వాడుతూ, ఎల్లప్పుడూ 'రిలీవర్ ఇన్‌హేలర్'ను వెంట ఉంచుకోవాలి. వాహనాల పొగ, సిగరెట్ పొగ, అగరబత్తీలు లేదా కట్టెల పొయ్యి పొగకు వీలైనంత దూరంగా ఉండాలి. బయట గాలి నాణ్యత (AQI) బాగాలేనప్పుడు లేదా చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయట వాకింగ్ చేయకుండా, ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు, ప్రాణాయామం చేయడం మంచిది.

ఆస్తమా అటాక్ వస్తే ఏం చేయాలి మరి..?

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో బరువుగా అనిపించడం, శ్వాస తీసుకుంటున్నప్పుడు పిల్లికూతలు (Wheezing) రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులు సూచించిన 'ఆస్తమా యాక్షన్ ప్లాన్' ప్రకారం రిలీవర్ ఇన్‌హేలర్ (Reliever Inhaler) ఉపయోగించాలి. ఒకవేళ ఇన్‌హేలర్ వాడిన తర్వాత కూడా ఆయాసం తగ్గకపోయినా, మాట్లాడటం కష్టంగా మారినా, పెదవులు లేదా గోళ్లు నీలం రంగులోకి మారుతున్నట్లు అనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ఆసుపత్రికి వెళ్లి అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.