World Diabetes Day -2026 : మనం సాధారణ సమస్యలుగా భావించే ఈ లక్షణాలు డయాబెటిస్ ముందస్తు సంకేతాలు కావచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో వేగంగా విస్తరిస్తున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ (Diabetes) ఒకటి. అయితే, చాలామందిలో ఈ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడు స్పష్టమైన లక్షణాలు కనిపించవు. ఒకవేళ కొన్ని మార్పులు కనిపించినా, వాటిని సాధారణ నీరసం లేదా పని ఒత్తిడి వల్ల కలిగే ఇబ్బందులుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు (high blood sugar levels) దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉండటం వల్ల గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాల(heart, kidneys, eyes, and nerves)పై తీవ్ర ప్రభావం పడుతుంది.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

రక్తంలో చక్కెర స్థాయిలు..

రక్తంలో చక్కెర స్థాయిలు (high blood sugar levels) దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉండటం వల్ల గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాల(heart, kidneys, eyes, and nerves)పై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం ఎంతో ముఖ్యం. డయాబెటిస్ ముందస్తు లక్షణాలు ఎలా ఉంటాయి..? ఎవరికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది..? నివారణ చర్యలేంటో తెలుసుకుందాం..

డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు ఇవే..

శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు కొన్ని సాధారణ మార్పులు కనిపిస్తాయి. తరచూ మూత్రవిసర్జన: రక్తంలో అదనంగా ఉన్న గ్లూకోజ్‌ను బయటకు పంపేందుకు కిడ్నీలు ఎక్కువగా శ్రమిస్తాయి. దీనివల్ల మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి పూట నిద్రలో ఎక్కువసార్లు లేవాల్సి రావడం దీనికో సంకేతం.

తరచూ మూత్రవిసర్జన వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఫలితంగా ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరకపోవడం, నోరు ఎండిపోవడం వంటివి జరుగుతాయి. ఎలాంటి డైటింగ్ లేదా వ్యాయామం చేయకపోయినా బరువు తగ్గిపోవడం డయాబెటిస్ లక్షణం కావచ్చు. శరీరం గ్లూకోజ్‌ను శక్తిగా మార్చుకోలేనప్పుడు, కొవ్వును, కండరాలను కరిగించి శక్తిని పొందే ప్రయత్నం చేస్తుంది.

 గ్లూకోజ్ కణాలు.. 

 రాత్రిపూట కంటినిండా నిద్రపోయినా రోజంతా నీరసంగా, నిస్సత్తువగా అనిపించడం బ్లడ్ షుగర్ పెరుగుదలను సూచిస్తుంది. శరీర కణాలకు అవసరమైన శక్తి అందకపోవడమే దీనికి కారణం. ఇన్సులిన్ లోపం లేదా అది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆహారంలోని గ్లూకోజ్ కణాలకు చేరదు. దీంతో తిన్న కాసేపటికే మళ్లీ విపరీతంగా ఆకలి వేస్తుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల కంటి కటకంలో (lens) వాపు వచ్చి, చూపు మసకబారే ప్రమాదం ఉంది.

మధుమేహం వల్ల రక్తప్రసరణ మందగించి, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల చిన్నపాటి దెబ్బలు లేదా పుండ్లు మానడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది. చర్మం, చిగుళ్లు, మూత్రనాళం (Urinary Tract) సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు పదేపదే వేధిస్తుంటే అప్రమత్తం కావాలి.

బ్లడ్ షుగర్ విపరీతంగా పెరిగినప్పుడు కనిపించే సంకేతాలు.. 

రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే బాగా ఎక్కువైనప్పుడు నోరు, గొంతు ఎండిపోవడం, తలనొప్పి, చర్మంపై దురద, తీవ్రమైన బలహీనత కనిపిస్తాయి. ఒకవేళ వీటితో పాటు వాంతులు, కడుపునొప్పి, వేగంగా శ్వాస తీసుకోవడం, శ్వాసలో పండ్ల వంటి వాసన రావడం లేదా అయోమయంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. ఇది 'డయాబెటిక్ కీటోఅసిడోసిస్' అనే ప్రమాదకర స్థితికి సంకేతం కావచ్చు.

ఎవరికి ముప్పు ఎక్కువ..?

 అధిక బరువు ఉండటం, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. తల్లిదండ్రులు లేదా తోబుట్టువులకు మధుమేహం ఉంటే ఇతరులకు వచ్చే అవకాశాలు ఎక్కువ. గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, వ్యాయామం చేయకపోవడం ప్రధాన కారణాలు.

చక్కెర పదార్థాలు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం జీవక్రియను దెబ్బతీస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఈ ముప్పు పెరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి, డయాబెటిస్ స్థాయికి చేరుకోని 'ప్రీ-డయాబెటిస్' దశలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

నివారణకు ఏం చేయాలి..?

జీవనశైలిలో కొన్ని సానుకూల మార్పులు చేసుకోవడం ద్వారా టైప్-2 డయాబెటిస్ ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, పీచు పదార్థం (fiber) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శీతల పానీయాలు, తీపి పదార్థాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా నియంత్రించుకోవాలి. ప్రతిరోజూ కంటినిండా నిద్రపోవాలి, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవద్దు. 30 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకోవాలి.

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.