రక్త హీనత సమస్యను అధిగమించాలంటే..ఏం చేయాలి..?
సాక్షి లైఫ్ న్యూస్ : మహిళలలో రక్తహీనత సమస్య ఎక్కువకాలం కొనసాగితే రక్తంలో ప్రాణవాయువు తగ్గిపోయి గుండె, మెదడు, ఇతర అవయవాలకు నష్టం జరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం మహిళలు రక్తహీనత బారిన పడుతున్నారు.
ఒళ్లంతా నొప్పులు, అరికాళ్లలో మంటలు, కొద్దిదూరం నడిచినా ఆయాసం, చిన్న చిన్న పనులకే అలసట.. ఇవన్నీ రక్తహీనతకు సంకేతం కావచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. రక్తంలో ఎర్ర రక్తకణాలు తక్కువ కావడాన్నే రక్తహీనతగా పరిగణిస్తారు.
ప్రాసెస్ చేసిన ఆహారం, పచ్చళ్లు వంటివాటికి దూరంగా ఉండాలి. లేదంటే వీటిల్లో ఉండే టానిన్ ఇనుమును శరీరం అందుకోకుండా అడ్డుపడుతుంది. అలాగే ఐరన్‌ని మాత్రల రూపంలో తీసుకునేవారు ఖాళీ కడుపుతో వేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఆ పోషకం త్వరగా అందుతుంది. లేదంటే పళ్లరసంతో తీసుకోవచ్చు. అదీ కుదరకపోతే టాబ్లెట్ వేసుకున్నతర్వాత విటమిన్ "సి" ఎక్కువగా లభించే జామ, బొప్పాయి, ఆరెంజ్ వంటి పండ్లను తీసుకోవాలి.
మాంసాహార పదార్థాలు..
మాంసాహార పదార్థాలైన చికెన్, లివర్, గుడ్డులోని పచ్చసొనల్లో ఇనుము ఎక్కువగా లభిస్తుంది. అదే శాఖాహారులు అయితే వేయించిన సెనగపప్పు, ఉలవలు, బొబ్బర్లు, పెసలు, ఎర్రపప్పులను ఎక్కువగా తీసుకోవాలి.
గోరుచిక్కుడు..
గోరుచిక్కుడులో ఐరన్‌తో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా లభిస్తుంది. అలాగే కరివేపాకు, గోంగూర, పుదీన, మెంతికూర, మునగాకు, తోటకూర వంటివాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు ఏ రూపంలో తిన్నా మంచిదే.. రోజూ చెంచా నువ్వులు, బెల్లం, పల్లీలు తినాలి.
ఉదాహరణకు రోజూ కనీసం ముప్ఫై గ్రాముల పల్లీలు తినగలిగితే వాటినుంచి 1.5 మిల్లీగ్రాముల ఇనుము శరీరానికి అందుతుంది. ఎండుద్రాక్ష, నల్లద్రాక్ష, ఖర్జూరం వంటివి తినచ్చు. చుక్కకూర, పాలకూర, పుదీనాలలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.
బీ12..
అలాగే పచ్చి బఠాణి, గోరుచిక్కుడు, కమలాపండు, పప్పుధాన్యాలు వంటి వాటిలో కూడా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. బీ12 శాఖాహార పదార్థాల నుంచి అందే అవకాశం చాలా తక్కువ. మాంసాహారంలో పీతలు, చేపలు, లివర్, కోడిగుడ్డుతో పాటు కొంత మొత్తంలో పాల పదార్థాలైన చీజ్‌ల నుంచి బీ12 లభిస్తుంది. తక్కువ కేలరీలు కలిగిన పాలు, పెరుగుని ఎక్కువగా తీసుకోవచ్చు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
