Contraceptive Pills : గర్భనిరోధక మాత్రలు వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి..! లేదంటే పాణాలకే ముప్పు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అవాంఛిత గర్భాన్ని నివారించడానికి నేటి కాలంలో గర్భనిరోధక మాత్రల (Contraceptive pills) వాడకం సర్వసాధారణమై పోయింది. చాలామంది వైద్యుల సలహా లేకుండానే మెడికల్ షాపుల్లో వీటిని కొనుగోలు చేసి వాడుతున్నారు. అయితే, ఈ మాత్రలు శరీరంలో ఎలా పనిచేస్తాయి..? దీర్ఘకాలం పాటు వీటిని వాడటం సురక్షితమేనా..? భవిష్యత్తులో ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా..? అనే సందేహాలు చాలామంది మహిళల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గర్భనిరోధక మాత్రల పనితీరు, వాటితో పొంచి ఉన్న ఆరోగ్య ముప్పుల గురించి వివరంగా తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

శరీరంలో ఇవి ఎలా పనిచేస్తాయి..?

గర్భనిరోధక మాత్రల్లో ప్రయోగశాలల్లో రసాయనికంగా సృష్టించిన కృత్రిమ హార్మోన్లు (estrogen and progestin) ఉంటాయి. ఇవి ప్రధానంగా మూడు రకాలుగా గర్భధారణను అడ్డుకుంటాయి. అండం విడుదలను అడ్డుకోవడం..అండాశయం నుంచి అండం విడుదల (ovulation) కాకుండా ఇవి నిరోధిస్తాయి. గర్భాశయ ముఖద్వారం వద్ద ఉండే శ్లేష్మాన్ని ఇవి మందంగా, చిక్కగా మారుస్తాయి. దీనివల్ల శుక్రకణాలు అండం వైపు వెళ్లకుండా అడ్డుకట్ట పడుతుంది.

గర్భాశయ లోపలి పొరను పలుచగా చేయడం ద్వారా, ఒకవేళ ఫలదీకరణ జరిగినా పిండం అక్కడ అతుక్కుని పెరగకుండా ఇవి నివారిస్తాయి. వైద్యుల సూచన మేరకు సరైన పద్ధతిలో వాడితే, అవాంఛిత గర్భాన్ని నివారించడంలో ఇవి 99 శాతం మేర ప్రభావవంతంగా పనిచేస్తాయి.

సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి..?

చాలామందిలో ఉన్న ప్రధాన అపోహ.. ఈ మాత్రలు వాడితే భవిష్యత్తులో పిల్లలు పుట్టరని..! అయితే తాజా అధ్యయనాల ప్రకారం ఈ మాత్రల వల్ల శాశ్వత వంధ్యత్వం (Infertility) రాదు. మాత్రల వాడకం ఆపేసిన 1 నుంచి 3 నెలల్లోపే సంతానోత్పత్తి సామర్థ్యం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అత్యవసర మాత్రలతో చిక్కులు..అత్యవసర గర్భనిరోధక మాత్రలను (Emergency contraceptive pills) పదేపదే వాడటం వల్ల రుతుక్రమం తప్పుతుంది.

హార్మోన్ల అసమతుల్యత..దీర్ఘకాలం పాటు వీటిని వాడటం వల్ల శరీరంలో సహజ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. సమస్యలు గుర్తించకపోవడం..కొంతమందిలో పీసీఓఎస్ (PCOS) లాంటి అంతర్లీన సమస్యలు ఉన్నప్పటికీ, ఈ మాత్రల వాడకం వల్ల ఆ లక్షణాలు బయటపడవు. మాత్రలు ఆపేసిన తర్వాత అవి సంతానోత్పత్తిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

దీర్ఘకాలిక వాడకంతో పొంచి ఉన్న ఇతర ముప్పులు..

వైద్యుల పర్యవేక్షణ లేకుండా, మోతాదుకు మించి హార్మోన్ల మాత్రలు వాడటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నివేదికలు హెచ్చరిస్తున్నాయి.రక్తం గడ్డకట్టడం (Venous Thromboembolism).. ఈ మాత్రల్లో ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్ రక్తం గడ్డకట్టే కారకాలను పెంచుతుంది. దీనివల్ల కొందరిలో సిరల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది.రక్తపోటు పెరుగుదల (Hypertension)..ఈస్ట్రోజెన్ కలిగిన మాత్రలను అధిక కాలం వాడటం వల్ల రక్తనాళాలు, మూత్రపిండాలపై ఒత్తిడి పడి బీపీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బీపీ ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా వీటిని వాడితే గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది.పిత్తాశయ రాళ్లు.. ఈస్ట్రోజెన్ కారణంగా పిత్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, పిత్తాశయంలో రాళ్లు (Gallstones) ఏర్పడే ప్రమాదం అధికమవుతుంది.

మెదడు కణితి ముప్పు..

 

డానిష్ మెడిసిన్స్ ఏజెన్సీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో.. అధిక మోతాదులో హార్మోన్ల మందులు వాడే మహిళల్లో 'మెనింగియోమా' అనే మెదడు కణితి వచ్చే ముప్పు ఉన్నట్లు తేలింది. ఇవి సాధారణంగా క్యాన్సర్ కణితులు కాకపోయినప్పటికీ, సకాలంలో గుర్తించకపోతే ప్రమాదకరంగా మారవచ్చు. గర్భనిరోధక మాత్రలు అవాంఛిత గర్భాన్ని నివారించడానికి సులభమైన మార్గమే అయినప్పటికీ, ప్రతి మహిళ శరీరం వీటి పట్ల ఒకేలా స్పందించదు. కాబట్టి, తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, మీ ఆరోగ్య పరిస్థితికి తగిన మందులను, వారు సూచించిన సరైన మోతాదులో మాత్రమే వాడటం శ్రేయస్కరం. సొంత వైద్యం ఎప్పటికీ ప్రమాదకరమే అన్న విషయాన్ని మరువకండి.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.