Cause of Anemia : అలసట, ఆయాసమా..? రక్తహీనతకు కేవలం ఇనుము లోపమే కాదు.. ఆ ఖనిజం కూడా కారణమే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కొద్దిగా దూరం నడవగానే ఆయాసం రావడం.. చిన్న పనికే విపరీతమైన అలసట.. ముఖం పాలిపోయినట్లు కావడం.. తరచూ తల తిరగడం.. సమాజంలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్యలివి. చాలా సందర్భాలలో ఇవి రక్తహీనత (Anemia) కు సంకేతాలుగా వైద్యనిపుణులు గుర్తిస్తారు. మనదేశంలో ముఖ్యంగా మహిళలు, కౌమారదశలో ఉన్న బాలికలు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు.

రక్తహీనత అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇనుము (Iron) లోపం మాత్రమే. కానీ, శరీరంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ సరిగ్గా ఉత్పత్తి కావడానికి ఇనుముతో పాటు 'రాగి' (Copper) వంటి సూక్ష్మపోషకాలు కూడా అంతే అవసరమని మీకు తెలుసా..? శరీరంలో తగినంత ఐరన్ ఉన్నప్పటికీ.. రాగి లోపం ఉంటే శరీరం ఆ ఇనుమును సమర్థవంతంగా వినియోగించుకోలేదు. ఫలితంగా రక్తహీనత ముప్పు పొంచి ఉంటుంది.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

రాగి లోపం (copper deficiency)ఎందుకు వస్తుంది..?

సాధారణంగా శరీరంలో ఐరన్ రవాణాకు, వినియోగానికి రాగి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, కొందరు వైద్య సలహా లేకుండా సుదీర్ఘకాలం పాటు అధిక మోతాదులో 'జింక్' (Zinc) సప్లిమెంట్లను వాడుతుంటారు. ఇది శరీరంలో రాగి శోషణను అడ్డుకుంటుంది. దీనితో పాటు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, జీర్ణకోశ లోపాల వల్ల కూడా శరీరానికి రాగి అందకుండా పోతుంది.

కేవలం రక్తహీనతే కాదు.. నాడీ సమస్యలు కూడా..!

రాగి లోపం తీవ్రమైతే కేవలం రక్తహీనతకే పరిమితం కాదు. ఇది నాడీ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది. చేతులు, కాళ్ళలో జలదరింపు రావడం, నడుస్తున్నప్పుడు అడుగులు తడబడటం, రోగనిరోధక శక్తి క్షీణించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

రక్తహీనతతో పొంచి ఉన్న ఇతర ప్రమాదాలు..

రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం వల్ల కణజాలాలకు ఆక్సిజన్‌ను చేరవేసే సామర్థ్యం తగ్గుతుంది. ఇది కేవలం శారీరక బలాన్ని మాత్రమే కాకుండా మానసిక సామర్థ్యాన్ని, జీవన నాణ్యతను కూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా గర్భిణీలలో ఈ లోపాలు ఉంటే పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇనుము లోపం వల్ల తీవ్రమైన నీరసం, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.