హెచ్.పి.వి వ్యాక్సిన్ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా కీలక ప్రకటన..
సాక్షి లైఫ్ : స్త్రీలను ప్రభావితం చేసే మహమ్మారి గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ 2024లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్.పి.వి) వ్యాక్సిన్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్యాన్సర్‌కు కారణం HPV, ఇది ఒక రకమైన వైరస్. గురువారం పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించారు. గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. హెచ్‌పివికి సంబంధించిన అనేక అపోహల ప్రజల్లో ఉన్నాయి. దాని గురించి అవగాహన లేకపోవడంతో ఈ క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గర్భాశయ క్యాన్సర్ అనేది మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. 2018 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 5.7 లక్షల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దాదాపు 3.1 లక్షల మంది మహిళలు ఈ కారణంగా మరణించారు. ఇలాంటి ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను నిరోధించడం చాలా ముఖ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అందులోభాగంగానే ఆరోగ్య రంగానికి సంబంధించి పలు ప్రకటనలు చేశారు.
హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్ పివి)..
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు 9-14 ఏళ్లలోపు బాలికల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించ నున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్ పివి) నుంచి రక్షించడానికి HPV వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ వ్యాధిని నివారించడానికి HPV వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఈ వైరస్ గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోవడం జనాల్లో కొన్ని అపోహలున్నాయి. దీని వల్ల ఈ టీకాను ఎవరూ సరిగా తీసుకోవడంలేదు.
హ్యూమన్ పాపిల్లోమావైరస్ అంటే ఏమిటి..?
హ్యూమన్ పాపిల్లోమావైరస్ అనేది శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేసే ఒక వైరస్. ఈ వైరస్‌లో 100 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖం, చేతులు, కాళ్లు మొదలైన వాటిపై మొటిమలను కలిగిస్తాయి. మరికొన్ని యోని, గర్భాశయం, పురుషాంగం, పాయువు మొదలైన వాటిని ప్రభావితం చేస్తాయి.
ఇది కూడా చదవండి.. దంత సమస్యలు ఎవరిలో ఎక్కువ..? ఎందుకు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
