COVID-19 Cases Rising Again : మళ్లీ కరోనా కలకలం: బ్రిటన్‌లో పెరుగుతున్న కేసులు.. వేరియంట్ 'ఎక్స్‌ఎఫ్‌జీ'తో ముప్పేమిటి..?
సాక్షి లైఫ్ : ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టినా.. కరోనా వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ మనుగడ సాగించే క్రమంలో నిరంతరం జన్యు ఉత్పరివర్తనాలకు (genetic mutations) గురవుతూ కొత్త రూపాలు దాలుస్తోంది. తాజాగా బ్రిటన్‌లో కొవిడ్ పాజిటివిటీ రేటు, ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ తాజా వ్యాప్తికి ఒమిక్రాన్ సబ్-వేరియంట్ అయిన ‘ఎక్స్‌ఎఫ్‌జీ’ (XFG) కారణమని వైద్య నిపుణులు గుర్తించారు.
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య..
యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) నివేదికల ప్రకారం..బ్రిటన్ ఆసుపత్రుల్లో కొవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేటు 5.9 శాతం నుంచి 7 శాతానికి చేరింది. ప్రతి లక్ష మంది జనాభాలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి నిష్పత్తి 0.81 నుంచి 1.20కి పెరిగింది. ఇది దాదాపు 48 శాతం పెరుగుదలను సూచిస్తోంది. ముఖ్యంగా లండన్ నగరంలో అడ్మిషన్ల రేటు ఏకంగా 79 శాతం వరకు పెరగడం గమనార్హం. జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించిన నమూనాల్లో సగానికి పైగా ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్‌కు సంబంధించినవే ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారే అధికంగా ఆసుపత్రుల పాలవుతున్నారు.
ఏమిటీ ‘ఎక్స్‌ఎఫ్‌జీ’ వేరియంట్..?
వైరాలజీ నిపుణుల కథనం ప్రకారం ఎక్స్‌ఎఫ్‌జీ అనేది ఒక రీకాంబినెంట్ వేరియంట్. అంటే వైరస్‌లోని రెండు వేర్వేరు జన్యు భాగాలు కలవడం వల్ల ఇది రూపాంతరం చెందింది. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన LF.7, LP.8.1.2 అనే రెండు సబ్-వేరియంట్ల కలయికతో ఇది ఏర్పడింది. దీన్ని 'స్ట్రాటస్' (Stratus) లేదా 'అమెరికన్ కొవిడ్' అనే పేర్లతోనూ పిలుస్తున్నారు. ఈ వేరియంట్‌ను తొలిసారి 2025 జనవరిలో గుర్తించగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని ‘వేరియంట్ అండర్ మానిటరింగ్’ (VUM) విభాగంలో ఉంచి పరిశీలిస్తోంది.
బాధితుల్లో కనిపిస్తున్న లక్షణాలు..
ప్రస్తుతం ఎక్స్‌ఎఫ్‌జీ బారిన పడుతున్న వారిలో తీవ్రమైన లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. సాధారణ ఫ్లూ తరహా లక్షణాలే ఎక్కువగా నమోదవుతున్నాయి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి. ముక్కు కారడం, తీవ్రమైన నీరసం, అలసట. కొందరిలో ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, కడుపులో అసౌకర్యం లేదా విరేచనాలు. కంటి ఇన్ఫెక్షన్లు లేదా ఛాతీలో స్వల్ప ఇబ్బందులు. వ్యాధి నిరోధక శక్తి బాగున్న వారిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్ తగ్గిపోతోంది.
ప్రమాద తీవ్రత ఎంత..?
ప్రస్తుతం వ్యాపిస్తున్న ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్ వల్ల మునుపటి వేరియంట్ల కంటే ఎక్కువ ప్రాణనష్టం లేదా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విస్తృతంగా జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల ప్రజల్లో 'హైబ్రిడ్ ఇమ్యూనిటీ' పెరిగింది. కాబట్టి 2020-23 నాటి సంక్షోభ పరిస్థితులు పునరావృతం కావని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. అయితే, వృద్ధులు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు తగ్గకపోతే సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
