Hepatitis B Vaccine : హెపటైటిస్-బి వ్యాక్సిన్ ప్రయోగం రద్దు.. ఆఫ్రికా స్టడీపై వెనక్కి తగ్గిన అమెరికా..
సాక్షి లైఫ్ : ఆఫ్రికాలోని న్యూ బర్న్ బేబీస్ పై నిర్వహించాలనుకున్న వివాదాస్పద హెపటైటిస్-బి వ్యాక్సిన్ పరిశోధన ఎట్టకేలకు రద్దయింది. అమెరికా ప్రభుత్వం 1.6 మిలియన్ డాలర్ల అంటే సుమారు13 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్ట తలపెట్టిన ఈ ప్రాజెక్టుపై శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. ప్రాణాలను కాపాడే టీకాను కొందరికి ఇవ్వకుండా నిలిపివేయడం ఏంటన్న 'నైతిక' ప్రశ్నలు ఈ అధ్యయనాన్ని నీరుగార్చాయి.
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
వివాదం ఏమిటంటే..?
పశ్చిమ ఆఫ్రికాలోని గినియా-బిసావు దేశంలో హెపటైటిస్-బి వ్యాధి తీవ్రత చాలా ఎక్కువ. అక్కడ పుట్టిన వెంటనే శిశువులకు టీకా ఇవ్వడం అత్యవసరం. అయితే, అమెరికాలోని ఆరోగ్య విభాగం ఒక డానిష్ పరిశోధక బృందంతో కలిసి అక్కడ ఒక వింత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సుమారు 14వేల మంది శిశువులను రెండు గ్రూపులుగా విడగొట్టి, ఒక బృందానికి పుట్టిన వెంటనే టీకా వేయడం, రెండో బృందానికి ఆరు వారాల తర్వాత వేయడం జరిగింది.
టీకాపై అభ్యంతరం..
టీకా వేయడం వల్ల కలిగే 'ఇతర ఆరోగ్య ఫలితాలను' గమనించేందుకే ఈ జాప్యం చేస్తున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, అప్పటికే పనిచేస్తుందని నిరూపితమైన టీకాను చిన్న పిల్లలకు ఇవ్వకుండా ఆపడం వారి ప్రాణాలతో చెలగాటమాడటమేనని నిపుణులు మండిపడ్డారు.
విమర్శల వెల్లువ..
ఈ ప్రయోగం బయటకు రాగానే వైద్య రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అగ్రరాజ్యం అమెరికా తన సొంత దేశంలో పాటించే నిబంధనలను ఆఫ్రికాలో తుంగలో తొక్కిందని, ఇది "నైతిక విలువల ఉల్లంఘన" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూనిసెఫ్ (UNICEF) వంటి సంస్థలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి.
ప్రాణాలను రక్షించే టీకాను కేవలం పరిశోధన కోసం పిల్లలకు దూరం చేయడం అమానవీయం. ఇది వైద్య చరిత్రలో ఒక నల్లటి మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయం..
తీవ్ర ఒత్తిడి నడుమ, అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం (HHS) ఈ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిధుల కేటాయింపులో పారదర్శకత లేకపోవడం, డెన్మార్క్ శాస్త్రవేత్తలకు నేరుగా కాంట్రాక్ట్ ఇవ్వడంపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. శాస్త్రీయ పరిశోధనలు ఎప్పుడూ మానవ ప్రాణాలను కాపాడేవిగా ఉండాలి తప్ప, వాటిని పణంగా పెట్టేవిగా ఉండకూడదని ఈ ఉదంతం మరోసారి రుజువు చేసింది.
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
