Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
సాక్షి లైఫ్ : నేటి యువతలో ఫ్యాషన్‌గా మారి, శరీరంపై శాశ్వత కళారూపాలుగా మారుతున్నాయి పచ్చబొట్లు (Tattoos).. ఇలాంటి వాటిని శరీరంపై వేయించుకునే వారికి తాజా అధ్యయనం షాక్ కలిగించే వార్తను వెల్లడించింది. పచ్చబొట్లు వేయించుకున్న వారిలో అత్యంత ప్రమాదకరమైన చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 29 శాతం ఎక్కువగా ఉంటుందని స్వీడన్‌లోని ప్రముఖ లండ్ విశ్వవిద్యాలయం (Lund University) పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
అధ్యయనం చెప్పిందేమిటంటే..?
ఈ పరిశోధకులు సుమారు 12వేల మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పచ్చబొట్లు వేయించుకున్న వ్యక్తుల డేటాను, జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ డేటాతో పోల్చి చూసినప్పుడు ఈ షాకింగ్ ఫలితాలు బయటపడ్డాయి.
మెలనోమా ముప్పు అధికం..
టాటూలు ఉన్నవారికి చర్మ క్యాన్సర్‌లో అత్యంత తీవ్రమైనదైన మెలనోమా వచ్చే ప్రమాదం 29శాతం పెరిగినట్లు స్పష్టమైంది. పచ్చబొట్టు వేయించుకుని పదేళ్లకు పైగా అయిన వారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. అయితే, ఈ సమూహంలో నమూనా పరిమాణం చిన్నదిగా ఉన్నందున దీనిని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని కూడా వారు పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా, టాటూ పరిమాణం చిన్నదైనా, పెద్దదైనా ముప్పుపై పెద్దగా ప్రభావం చూపలేదని అధ్యయనంలో తేలింది. చర్మానికి వచ్చే మరొక రకమైన క్యాన్సర్ స్క్వామస్ సెల్ కార్సినోమా తో పచ్చబొట్లకు ఎలాంటి సంబంధం కనిపించలేదు.
ఎందుకీ ప్రమాదం అంటే..?
పచ్చబొట్లు నేరుగా క్యాన్సర్‌కు కారణమవుతాయని అధ్యయనం నిర్ధారించనప్పటికీ, పరిశోధకులు కొన్ని కారణాలను అనుమానిస్తున్నారు.
టాటూ సిరాలో ఉండే వివిధ రసాయన సమ్మేళనాలు, ముఖ్యంగా సూర్యరశ్మికి గురైనప్పుడు లేదా లేజర్ తొలగింపు సమయంలో విచ్ఛిన్నమై హానికరమైన పదార్థాలుగా మారే అవకాశం ఉంది.
సిరా రేణువులను రోగనిరోధక వ్యవస్థ పదార్థాలుగా భావించి, వాటిని శోషరస గ్రంథుల్లోకి రవాణా చేస్తుంది. ఇక్కడ అవి సంవత్సరాల తరబడి పోగుపడతాయి. శోషరస గ్రంథుల్లో ఈ రేణువులు పోగుపడటం వల్ల దీర్ఘకాలిక వాపు ఏర్పడవచ్చని, ఈ వాపు క్యాన్సర్ అభివృద్ధికి దోహదపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
పచ్చబొట్లు ఉన్నవాళ్లు ఏం చేయాలి..?
ఈ అధ్యయనం టాటూలు వేయించుకున్న వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కానీ అవగాహనతో ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చబొట్టు ఉన్న ప్రాంతంలో సన్‌స్క్రీన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. అధిక సూర్యరశ్మికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి.
చర్మంపై, ముఖ్యంగా టాటూ ఉన్న ప్రాంతంలో పుట్టుమచ్చలు (Moles) కొత్తగా ఏర్పడటం లేదా ఉన్నవాటి ఆకారం, రంగు మారడం వంటి అసాధారణ మార్పులను గమనిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని (Dermatologist) సంప్రదించాలి. పచ్చబొట్లు, క్యాన్సర్ మధ్య ఖచ్చితమైన కారణ సంబంధాన్ని తెలుసుకోవడానికి మరిన్ని విస్తృత స్థాయి, దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
