జె.ఎన్.వన్ వేరియంట్ పై ఆరోగ్య సంస్థలు ఏమి చెబుతున్నాయంటే..?
సాక్షి లైఫ్ : భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో గత కొద్ది రోజులుగా కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. నవంబర్ నుంచి చైనా, సింగపూర్‌లోనూ కోవిడ్ -19 కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. భారతదేశంలో శనివారం రోజువారీ కరోనా కేసులు దాదాపు ఎనిమిది నెలల రికార్డును బద్దలు కొట్టాయి.
24 గంటల్లో..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం..దేశంలో శుక్రవారం ఒక్కరోజే 752 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 3,000 దాటి 3,420కి చేరుకుంది. గత 24 గంటల్లో నలుగురు కూడా మరణించారు. కేరళలో ఇద్దరు ,రాజస్థాన్, కర్ణాటకాలో ఒక్కొక్కరు మృతి చెందారు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్-19 కేసులకు వేగంగా పెరుగుతున్న JN.1 వేరియంట్ ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన అధ్యయనాలలో, కరోనా ఈ రూపాంతరం Omicron మునుపటి వేరియంట్‌ల మాదిరిగానే ఉందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే JN.1 వేరియంట్ తన స్వభావాన్ని ప్రమాదకరంగా మార్చే కొన్ని అంశాలు ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్య సంస్థలు ఏమి చెబుతున్నాయి..?
"సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తో సహా ప్రపంచంలోని అన్ని ఆరోగ్య సంస్థలు, కరోనావైరస్ తనను తాను సజీవంగా ఉంచుకోవడానికి నిరంతరం పరివర్తన చెందుతోందని చెబుతున్నాయి. JN.1 కూడా దాని రూపాంతరం" అని వెల్లడిస్తున్నాయి.
శీతాకాలపు ఇన్ఫెక్షన్ వేవ్..
"ప్రస్తుత శీతాకాలపు ఇన్ఫెక్షన్ వేవ్ అకస్మాత్తుగా ఆందోళనను పెంచింది. అయితే ఈ మార్పు కారణంగా, చాలా మంది రోగులలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవడం ద్వారా కోలుకుంటున్నారు. అయినప్పటికీ, JN.1లో అదనపు వేరియంట్స్ కారణంగా, సంక్రమణ వేగంగా పెరిగే ప్రమాదం ఉంది" అని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
