Real Paneer : మీరు తినేది నిజమైన పనీరేనా..? నకిలీ పనీర్‌కు అడ్డుకట్ట వేసేందుకు కొత్త రూల్స్..

షేర్ చేయండి:
Real Paneer : మీరు తినేది నిజమైన పనీరేనా..? నకిలీ పనీర్‌కు అడ్డుకట్ట వేసేందుకు కొత్త రూల్స్..

సాక్షి లైఫ్ : హోటళ్లు, రెస్టారెంట్లలో లభించే మీకెంతో ఇష్టమైన ‘పనీర్ బటర్ మసాలా’ లేదా ‘పనీర్ టిక్కా’లలో ఉన్నది అసలైన పనీరేనా? లేక తక్కువ ధరకు లభించే నకిలీ ప్రత్యామ్నాయమా? ఇకపై ఈ విషయాన్ని కస్టమర్లు సులభంగా తెలుసుకోవచ్చు. రెస్టారెంట్లు తాము ఉపయోగించే పనీర్ రకాన్ని మెనూ కార్డులలో తప్పనిసరిగా పేర్కొనేలా నియంత్రణ సంస్థలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో 'అనలాగ్ పనీర్' వాడితే మెనూలో స్పష్టంగా ప్రకటించాలని ఆదేశాలు జారీ చేయగా, త్వరలోనే హైదరాబాద్ సహా దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ ఈ నిబంధన అమల్లోకి రానుంది.

 

 

ఇది కూడా చదవండి..War Impact : యుద్ధం ఎఫెక్ట్ : మరింత భారం కానున్న దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలు.. 

ఇది కూడా చదవండి..LynchVax Vaccine : క్యాన్సర్‌కు ముకుతాడు.. ముందే అడ్డుకునే 'లించ్‌వ్యాక్స్' టీకా..!

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

 

అసలైన పనీర్‌కు.. 'అనలాగ్'కు తేడా ఏంటి..?

మార్కెట్లో ప్రస్తుతం వివిధ రకాల పనీర్లు లభ్యమవుతున్నాయి. వీటి నాణ్యత, పోషక విలువలపై వినియోగదారులకు అవగాహన ఉండటం ఎంతో అవసరం.

డైరీ బేస్డ్ పనీర్ అంటే నార్మల్  పనీర్.. ఇది పూర్తిగా పాలతో తయారవుతుంది. ఇందులో జంతు సంబంధిత ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.

అనలాగ్ పనీర్ అంటే కృత్రిమ పనీర్.. వెజిటబుల్ ఆయిల్ లేదా పామాయిల్‌ను పిండి పదార్థాలు, స్టెబిలైజర్లు, అతి తక్కువ పాల ఘనపదార్థాలతో కలిపి దీనిని తయారు చేస్తారు. ఇందులో ప్రోటీన్లు చాలా తక్కువగా, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

మలై పనీర్.. పూర్తిగా వెన్న తీయని పాలతో అదనపు మీగడ కలిపి తయారు చేస్తారు. ఇది చాలా మెత్తగా ఉండి, క్యాలరీలు ఎక్కువగా కలిగి ఉంటుంది.

ప్రోటీన్ పనీర్.. వెన్న తీసిన పాలు లేదా ఆల్ట్రా ఫిల్టర్డ్ పాలతో తయారవుతుంది. దీనికి అదనంగా సోయా ప్రోటీన్లు కలుపుతారు. ఇందులో కొవ్వు, పిండి పదార్థాలు తక్కువగా ఉండి, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.

  కస్టమర్లను మోసం చేస్తూ..!

నిజానికి భారతీయ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) నిబంధనల ప్రకారం 'అనలాగ్ పనీర్' ఉత్పత్తి, విక్రయాలు చట్టబద్ధమైనవే. అయితే, ఇది ఆరోగ్యానికి హానికరం కాకపోయినప్పటికీ, సంప్రదాయ పనీర్‌తో పోలిస్తే ఇందులో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి.

సాధారణ పనీర్‌తో పోలిస్తే అనలాగ్ పనీర్ తయారీ ఖర్చు ఏకంగా 50 నుండి 60 శాతం తక్కువ. హోటళ్లు, రోడ్డు పక్కన ఉండే స్ట్రీట్ వెండర్లు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ చౌక రకం పనీర్‌ను ఎక్కువగా వాడుతుంటారు. ఒకసారి గ్రేవీ లేదా కర్రీస్ చేసిన తర్వాత సాధారణ పనీర్‌కు, అనలాగ్ పనీర్‌కు ఉన్న తేడాను కంటితో చూసి గుర్తించడం కస్టమర్లకు దాదాపు అసాధ్యం. దీంతో తాము అసలైన పనీరే తింటున్నామనే భ్రమలో వినియోగదారులు మోసపోతున్నారు.

ప్రైవేట్ లాబ్ పరీక్షల్లో నగ్నసత్యాలు..

 ప్రముఖ కన్స్యూమర్ హెల్త్ అడ్వకేట్ రోహిత్ హిమత్సింకా సోషల్ మీడియా వేదిక 'X' ద్వారా ఈ విషయమై కీలక వివరాలు పంచుకున్నారు. గత ఏడాది ఆయన ప్రముఖ బ్రాండ్లు, డైరీలు, రెస్టారెంట్లు,  స్ట్రీట్ వెండర్ల నుంచి సేకరించిన పనీర్ శాంపిళ్లకు లాబ్ పరీక్షలు నిర్వహించగా.. రెస్టారెంట్లు, వీధి వ్యాపారుల వద్ద సేకరించిన శాంపిళ్లన్నీ ఫెయిల్ అయ్యాయని, అవన్నీ అనలాగ్ పనీర్‌గా తేలిందని వెల్లడించారు. కేవలం మహారాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ మెనూ నిబంధనను తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

మున్ముందు కఠిన చర్యలు..!

భారతదేశం అంతటా ఈ నిబంధనను ఒకేసారి అమలు చేయడం తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల కొంత సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో దీనిని అమలు చేయడం వల్ల హోటళ్లపై వినియోగదారులకు నమ్మకం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. హోటళ్లు తమ మెనూ కార్డులలో 'అనలాగ్ పనీర్' వాడుతున్నట్లు పేర్కొనకపోతే భారీ జరిమానాలతో పాటు కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Snakebite Crisis in Telangana : తెలంగాణలో పాముకాటుతో వందలో 13 మంది బలి..! ‘సీసీఎంబీ-లాకోన్స్’ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడి.. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.