NIN’s New Initiative for Healthy Food Choices : ఆరోగ్యకరమైన ఆహార ఎంపికల కోసం ఎన్‌ఐఎన్ సరికొత్త అడుగు.. ఏఐ టూల్‌తో ప్యాకేజ్డ్ ఫుడ్ గుట్టు రట్టు..!
సాక్షి లైఫ్ : నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాల (Pre-packaged foods) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, మనం కొనే ప్యాకెట్ల వెనుక ఉండే పోషకాల వివరాలు, రసాయనాల పేర్లు సాదాసీదా ప్రజలకు అర్థం కావడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో భారతీయులు తాము తినే ఆహారం పట్ల సరైన, ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (NIN) ఒక వినూత్నమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సెర్చ్ ఇంజన్, బాట్‌ను వెబ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించే పనిలో పడింది. మార్కెట్లో లభించే వేలాది ఆహార పదార్థాల పోషక విలువల సమాచారాన్ని (Nutritional Information) ఈ వేదిక ఒకే క్లిక్‌తో వినియోగదారులకు అందించనుంది.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఒకే చోట పోషకాల పూర్తి జాతకం..!
దేశంలో మధుమేహం (Diabetes), రక్తపోటు (Hypertension), గుండె సంబంధిత సమస్యల వంటి అంటువ్యాధులు కాని దీర్ఘకాలిక జబ్బుల (NCDs) భారం వేగంగా పెరుగుతోంది. దీనిని అడ్డుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పులు అత్యంత అవసరమని గుర్తించిన ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తలు ఈ సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తున్నారు.
ప్యాకేజ్డ్ ఫుడ్స్ విశ్లేషణ..
ఈ సరికొత్త టూల్ ప్యాక్ చేసిన ఆహారాల్లోని వివిధ రకాల పదార్థాలను విశ్లేషించి, వాటిలోని పోషక లోపాలను ఎత్తిచూపుతుంది.
కంపెనీలకు సైతం సహాయకారి..
ఒకసారి డేటా అప్‌లోడ్ అయిన తర్వాత, ఈ ఎన్‌ఐఎన్ ఏఐ బాట్ ఆహార తయారీదారులకు (Food manufacturers) తమ ఉత్పత్తుల ఫార్ములాను మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి (Product reformulation) ఉపయోగపడుతుంది.
లేబ్లింగ్ విధానానికి మద్దతు..
ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న 'ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబ్లింగ్' (FOPNL) విధానాన్ని దేశంలో సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ డేటాబేస్ ఎంతగానో దోహదపడనుంది.
'NatFirst', 'TruthIn' యాప్ భాగస్వామ్యం..
ఈ బృహత్తర లక్ష్యం కోసం ఎన్‌ఐఎన్ ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన 'TruthIn' అనే మొబైల్ అప్లికేషన్‌కు ఇప్పటికే 1.35 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు, లక్షకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ యాప్ గత ఏడాది జరిగిన ఎన్‌ఐఎన్ ఇన్‌ఫ్యూజ్ (NIN INFUSE) ఇన్నోవేషన్ సదస్సులో అవార్డును కూడా గెలుచుకుంది.
ఈ యాప్‌ను రూపొందించిన నాట్‌ఫస్ట్ (NatFirst) సహ వ్యవస్థాపకులు డాక్టర్ అమన్ బషీర్ షేక్ మాట్లాడుతూ.. "ఈ యాప్ ఆహార పదార్థాల్లోని పోషకాలు, లోపల వాడిన ఇతర రసాయనాలు (Ingredients)సదరు ఆహారాన్ని ఎంతవరకు ప్రాసెస్ చేశారనే (Level of processing) స్థాయిని నిశితంగా పరిశీలిస్తుంది. సాధారణంగా ప్యాకెట్ల వెనుక INS నంబర్లు లేదా కఠినమైన సాంకేతిక పదాలతో ఉండే కెమికల్స్ వివరాలను.. బార్‌కోడ్ స్కాన్ లేదా ప్రొడక్ట్ సెర్చ్ ద్వారా సామాన్యులకు సైతం అర్థమయ్యే అత్యంత సరళమైన భాషలో ఈ యాప్ వివరిస్తుంది" అని పేర్కొన్నారు.
75,000 పైగా ఉత్పత్తుల సమాచారం..!
ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్ వద్ద 75,000 కంటే ఎక్కువ ఆహార ఉత్పత్తుల డేటాబేస్ అందుబాటులో ఉంది. దీనివల్ల వివిధ ఆన్‌లైన్ షాపింగ్ కేటగిరీలలోని ఆహార పదార్థాల నాణ్యతను ఒకదానితో ఒకటి సులభంగా పోల్చి చూసుకోవచ్చు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు (Ultra-processed foods), వాటిలో దాగున్న ప్రమాదకరమైన ప్రిజర్వేటివ్‌లను కొనుగోలు చేయడానికి ముందే గుర్తించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆహార ప్యాకెట్లపై ఉండే లేబుళ్లను సేకరించి, విశ్లేషించి, ధృవీకరించడంలో ఇటువంటి ఏఐ అప్లికేషన్లు విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. వినియోగదారులు తాము ఏం తింటున్నారో స్పష్టంగా తెలుసుకుని, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేయడానికి ఈ సాంకేతికత అద్భుతమైన ఆయుధంగా మారనుంది.
ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
