Bird Flu : పక్షుల నుంచే కాదు.. ఆవు పాలు తాగినా బర్డ్ ఫ్లూ వస్తుందా..?
సాక్షి లైఫ్ : బర్డ్ ఫ్లూ (bird flu) ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా H5N1 అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కోళ్లు, ఇతర పక్షులు. కానీ, ఈ ప్రాణాంతక వైరస్ ఇప్పుడు పశువుల ద్వారా మనుషులకు వ్యాపిస్తోంది. తాజాగా అమెరికాలో ఈ తరహా కేసు నమోదు కావడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. పశువుల ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకుతున్న నేపథ్యంలో పాలు తాగడం సురక్షితమేనా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఆవు నుంచి మనిషికి..
అమెరికాలోని వాషింగ్టన్లో హెచ్5ఎన్1 (H5N1) బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. బాధిత వ్యక్తికి ఈ వైరస్ కోళ్ల నుంచి కాకుండా వ్యాధి సోకిన ఆవుల ద్వారా సోకడం గమనార్హం. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాలేదని అక్కడి వైద్యఅధికారులు వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపారు. ఇతరులకు ఈ వైరస్ సోకకుండా అతడిని ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వాషింగ్టన్‌లోని యాకిమా కౌంటీకి చెందిన రెండు డెయిరీ ఫామ్‌లలోని ఆవుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. దీంతో ఆ ఫామ్‌లను క్వారంటైన్ చేసి, పశువులకు చికిత్స అందిస్తున్నారు.
ఈ ముప్పు కొత్తదేమీ కాదు..
ఇలా ఆవుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ వ్యాపించడం ఇదే తొలిసారి కాదు. 2024 ఏప్రిల్‌లో టెక్సాస్‌లో మొదటిసారిగా ఓ డెయిరీ ఫామ్ వర్కర్‌కు పశువుల నుంచి ఈ వైరస్ సోకింది. తాజా కేసు నేపథ్యంలో పశువుల ఫారాల్లో పనిచేసేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరి పచ్చి పాలు తాగొచ్చా..?
వ్యాధి సోకిన ఆవుల పాలలోనూ ఈ వైరస్ ఆనవాళ్లు ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి పచ్చి పాలు (Raw milk), పాశ్చరైజ్ చేయని డెయిరీ ఉత్పత్తులను అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. పాలను బాగా మరిగించిన తర్వాతే తాగడం సురక్షితం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జబ్బు పడిన లేదా అకారణంగా చనిపోయిన పక్షులు, జంతువులకు దూరంగా ఉండాలి. పైకి ఆరోగ్యంగా కనిపించినా అడవి పక్షులను, గుర్తుతెలియని జంతువులను ముట్టుకోకూడదు. పశువులు, కోళ్ల ఫారాల్లో పనిచేసేవారు, వాటి బాగోగులు చూసుకునేవారు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు, కళ్లద్దాలు, రక్షణ దుస్తులు ధరించాలి. ప్రస్తుతానికి ఈ వైరస్ ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపిస్తున్నట్లు (Human-to-human transmission) ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, పరిశుభ్రత పాటించడం అత్యవసరం.
సగం మంది ప్రాణాలు తీస్తున్న మహమ్మారి..
పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (PAHO) గణాంకాల ప్రకారం.. 2003 నుంచి 2026 ఆగస్టు 7 వరకు ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో 1,002 మందికి ఈ H5N1 వైరస్ సోకగా, వారిలో ఏకంగా 479 మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని బట్టి ఈ వైరస్ మరణాల రేటు అంటే దాదాపు 50 నుంచి 53శాతం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదం.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
