Three Doshas : త్రిదోషాల సమతుల్యతే సంపూర్ణ ఆరోగ్యం..!
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, వేళంకాని వేళల్లో ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు నేడు అనేక దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తున్నాయి. ఆధునిక కాలంలో వేధిస్తున్న మధుమేహం, గుండెజబ్బులు, ఊబకాయం, రక్తపోటు వంటి సమస్యలన్నింటికీ మూలం జీవనశైలి లోపమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం ప్రకారం మానవ శరీరంలో వాత, పిత్త, కఫాలు సమతుల్యంగా ఉన్నంత కాలం ఎలాంటి వ్యాధులు దరిచేరవు. వీటిలో ఏ ఒక్కటి అసమతుల్యతకు గురైనా అనారోగ్యం తప్పదు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
త్రిదోషాలు అసమతుల్యమైతే ఏం జరుగుతుంది..?
శరీర వ్యవస్థను నియంత్రించే త్రిదోషాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు శరీరం వివిధ రుగ్మతలకు గురవుతుంది. వాతం పెరిగితే.. శరీరంలో గ్యాస్, కీళ్ల నొప్పులు, పొడి చర్మం, తీవ్రమైన నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి.
పిత్తం పెరిగితే..ఎసిడిటీ, ఛాతీలో మంట, విపరీతమైన కోపం, చర్మ సమస్యలు, శరీరంలో వేడి అధికమవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కఫం అధికమైతే..బద్ధకం, జీవక్రియ మందగించడం, బరువు పెరగడం, శ్వాసకోశ సమస్యలు, జలుబు వంటి రుగ్మతలు వేధిస్తాయి.
దోషాల సమతుల్యతకు ఆయుర్వేద మార్గాలు..
శరీర స్వభావాన్ని కాపాడుకుంటూ జీవనశైలి జబ్బుల బారిన పడకుండా ఉండటానికి వైద్యనిపుణులు పలురకాల నియమాలను సూచిస్తున్నారు.
1. షడ్రుచుల సమతుల్య ఆహారం..
ఆయుర్వేదం ప్రకారం ఆహారంలో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు సమపాళ్లలో ఉండాలి. తాజాగా వండిన ఆహారం, కాలానుగుణంగా లభించే పండ్లు, ఆకుకూరలను రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి. ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం.
2. క్రమశిక్షణతో కూడిన దినచర్య..
ఉదయాన్నే సూర్యోదయానికి ముందే మేల్కొనడం, రోజూ తగినంత నీరు తాగడం, ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిరంతర నిద్ర పొందడం శరీరానికి అవసరమైన విశ్రాంతిని అందిస్తాయి.
3. యోగా, ప్రాణాయామం..
క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు,ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
4. శారీరక శ్రమ..
రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల జీవక్రియ వేగవంతమై ఊబకాయం, మధుమేహం వంటి ముప్పులు తగ్గుతాయి.
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
