Protect Children from Swine Flu : పిల్లలను స్వైన్ ఫ్లూ నుంచి ఎలా రక్షించు కోవాలి..?
సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా హెచ్1ఎన్1 స్వైన్ ఫ్లూ(Swine Flu) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ.. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో ఇది తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కారణంగా ప్రాణనష్టం కూడా జరిగింది. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?
ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?
పిల్లలకు పొంచి ఉన్న ముప్పు..
పాఠశాలలు, ఆటస్థలాలు, స్కూల్ బస్సుల్లో పిల్లలు ఒకరికొకరు దగ్గరగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ సులభంగా వ్యాపిస్తుంది. హెచ్1ఎన్1 సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఇతరులకు సోకుతుంది. తరగతి గదిలో ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా, అది మిగతా వారికి వేగంగా వ్యాపిస్తుంది. పిల్లలు తరచుగా తమ కళ్లు, ముక్కు, నోటిని తాకుతుంటారు కాబట్టి వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువ. పైగా, తమకు కలుగుతున్న అనారోగ్య ఇబ్బందిని వారు సరిగ్గా చెప్పలేకపోవచ్చు కాబట్టి తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యవసరం.
ప్రమాదకరమైన లక్షణాలు..
జ్వరం, దగ్గు అనేవి ఫ్లూ సాధారణ లక్షణాలే అయినప్పటికీ కొన్నిరకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది లేదా అతి వేగంగా శ్వాస తీసుకోవడం. నీళ్లు, ద్రవాహారాలు సరిగ్గా తీసుకోకపోవడం. మూత్ర విసర్జన బాగా తగ్గిపోవడం. అసాధారణమైన నీరసం, నిస్సత్తువతో డల్ గా ఉండటం. జ్వరం తగ్గిపోయినట్టే తగ్గి, మళ్లీ తీవ్రంగా రావడం.
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పాఠశాలకు పంపకండి: పిల్లలకు జ్వరం, దగ్గు లేదా ఇతర ఫ్లూ లక్షణాలు ఉంటే స్కూల్ కి పంపకుండా ఇంట్లోనే పూర్తి విశ్రాంతినివ్వాలి. దీనివల్ల తోటి పిల్లలకు వైరస్ వ్యాపించకుండా అడ్డుకోవచ్చు. ద్రవాహారాలు ఎక్కువగా ఇస్తుండాలి.
ఫ్లూ అనేది వైరస్ వల్ల వచ్చే సమస్య. దీనిపై యాంటీబయాటిక్స్ పనిచేయవు. కాబట్టి వైద్యుల సలహా లేకుండా సొంతంగా యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు వాడకూడదు. తరచుగా సబ్బు, నీటితో చేతులు శుభ్రంగా కడుక్కోవడం పిల్లలకు అలవాటు చేయాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి, ముక్కుకు టిష్యూను అడ్డుపెట్టుకోవడం లేదా మోచేతిని అడ్డుపెట్టుకోవడం నేర్పించాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం, వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఫ్లూ నుంచి రక్షణ పొందడానికి ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించడం ఉత్తమం. వైద్యుల సలహా మేరకు పిల్లలకు ఈ టీకా వేయించడం వల్ల వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
