Type 3c Diabetes : టైప్-3సి డయాబెటిస్ నియంత్రణ నిజంగా కష్టమా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మధుమేహం అనగానే సాధారణంగా అందరికీ టైప్-1, టైప్-2 మాత్రమే గుర్తుకొస్తాయి. అయితే, వీటితో పాటు వైద్య పరిభాషలో 'టైప్-3సి' (Type 3c Diabetes) అని పిలిచే మరో ప్రమాదకరమైన డయాబెటిస్ కూడా ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో దీని లక్షణాలు టైప్-2ను పోలి ఉండటంతో సరైన నిర్ధారణ ఆలస్యమై తీవ్ర సమస్యలకు దారితీస్తోంది. అసలు టైప్-3సి డయాబెటిస్ ఎందుకు వస్తుంది..? దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

టైప్-3సి డయాబెటిస్..

క్లోమ గ్రంథి (pancreas) వ్యాధులకు గురైనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు వచ్చే మధుమేహాన్నే 'టైప్-3సి' లేదా 'పాంక్రియోటోజెనిక్ డయాబెటిస్' అంటారు. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్, గ్లూకగాన్ హార్మోన్లతో పాటు జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో క్లోమం కీలక పాత్ర పోషిస్తుంది. క్లోమం దెబ్బతిన్నప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాకుండా, జీర్ణవ్యవస్థ పనితీరు కూడా తీవ్రంగా దెబ్బతింటుంది.

ఇతర రకాలతో పోలిస్తే తేడా ఏమిటి..?

టైప్-1..రోగనిరోధక వ్యవస్థే పొరపాటున ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుంది.

టైప్-2.. శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం లేదా ఉన్న ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోలేకపోవడం వల్ల వస్తుంది.

టైప్-3సి.. క్లోమ గ్రంథిలో వాపు (Chronic pancreatitis), ఇన్ఫెక్షన్లు, కణితులు లేదా శస్త్రచికిత్సల కారణంగా ఆ భాగం దెబ్బతిని ఇన్సులిన్, జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి రెండూ మందగిస్తాయి.

ప్రధాన కారణాలు..?

దీర్ఘకాలిక పాంక్రియాటైటిస్.. క్లోమ గ్రంథిలో ఎక్కువ కాలం వాపు లేదా ఇన్ఫెక్షన్ ఉండటం.

క్లోమ క్యాన్సర్ లేదా సర్జరీ.. కణితుల వల్ల లేదా శస్త్రచికిత్స ద్వారా క్లోమంలో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని తొలగించాల్సి రావడం.

జన్యుపరమైన రుగ్మతలు.. సిస్టిక్ ఫైబ్రోసిస్, హిమోక్రోమాటోసిస్ వంటి వ్యాధులు క్లోమంపై ప్రభావం చూపడం.

ప్రధాన లక్షణాలు..? 

టైప్-3సి డయాబెటిస్‌లో సాధారణ షుగర్ వ్యాధి లక్షణాలతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి:

తరచూ దాహం వేయడం, అతిగా మూత్రవిసర్జన రావడం.

ఎటువంటి ప్రయత్నం లేకుండానే వేగంగా బరువు తగ్గిపోవడం.

నిరంతర అలసట, నీరసం.

కడుపునొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం.

ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, తరచూ విరేచనాలు జిడ్డు విరేచనాలు కావడం.

రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం అంటే హైపోగ్లైసీమియా లేదా విపరీతంగా పెరగడం.

నియంత్రణ ఎందుకు సంక్లిష్టం..?

టైప్-3సి బాధితుల్లో రక్తంలో చక్కెరను తగ్గించే ఇన్సులిన్‌తో పాటు, చక్కెర బాగా పడిపోయినప్పుడు పెంచే 'గ్లూకగాన్' హార్మోన్ లోపం కూడా ఉంటుంది. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయిలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. దీన్ని అదుపులో ఉంచకపోతే కళ్లు, మూత్రపిండాలు, గుండె, నరాల వ్యవస్థ దెబ్బతినే ముప్పు పెరుగుతుంది. గతంలో క్లోమ సంబంధిత సమస్యలు ఉండి, అకస్మాత్తుగా షుగర్, బరువు తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అవసరం.

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.