శిశువులకు ముద్దు ఎంత హానికరమో.. తెలుసా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఇంట్లోవాళ్లయినా, బయటవాళ్ళయినా చిన్న పిల్లలను చూడగానే ఎత్తుకుని ముద్దాడుతూ ఉంటారు. మన చుట్టూ ఉన్న చిన్న పిల్లలపై ప్రేమను కురిపిస్తారు. ముఖ్యంగా నవజాత శిశువుల విషయంలో  వారిని ముద్దాడి నవ్విస్తూ ఉంటారు. తమ ప్రేమను వ్యక్తపరచడానికి తరచుగా పిల్లలను ముద్దు పెట్టుకుంటారు. చిన్నారులపై ప్రేమను వ్యక్తీకరించడానికి ముద్దు అనేది ఒక మార్గం. ఐతే  నవజాత శిశువుల విషయంలో ముద్దు పెట్టుకోకూడదని చెబుతున్నారు డాక్టర్లు. 

కొంతమంది అయితే నవజాత శిశువులను ముఖంపై గానీ,పెదవులపై గానీ ముద్దు పెడుతూ ఉంటారు. ఇది చిన్నారులకు చాలా హాని కలిగిస్తుందట. మీ ప్రేమను వ్యక్తీకరించడానికి ఇది సులభమైన మార్గం అయినప్పటికీ, ఇది శిశువులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ముద్దు  శిశువులకు ఎంత హానికరమో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 ఎంత హానికరమంటే..?

నవజాత శిశువులలో రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉంటుంది. పుట్టిన కొద్దిరోజులకు వారిలో శరీరానికి సరిపడేంత ఇమ్యూనిటీ ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో శిశువులకు ముద్దు పెట్టడం కారణంగా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. చిన్నారుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.  కాబట్టి వారు కొన్ని వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. నవజాత శిశువుల పెదవులపై లేదా ముఖంపై ముద్దుపెట్టినప్పుడు, ఫ్లూ, వంటి శ్వాసకోశ వ్యాధులు వ్యాపించే ప్రమాదం పెరుగుతుంది. చిన్నారులను పెదవులపై, లేదా ముఖంపై కాకుండా శరీరంలోని ఇతర భాగాలను ముద్దుపెట్టుకోవడం సురక్షితం. అయినప్పటికీ, కొన్నిసార్లు పెద్దల నుంచి వైరస్ పిల్లలకు సోకుతుంది.  

బిడ్డను తోబుట్టువులు ముద్దాడటం ఎంతవరకు సురక్షితం..?

పిల్లలకు, ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్న పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, దీని కారణంగా వారు పాఠశాలలో ఇతర పిల్లల్తో సన్నిహితంగా ఉండటం వల్ల తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో నవజాత శిశువులను వారి తోబుట్టువుల నుంచి దూరంగా ఉంచడం మంచిది. నవజాత శిశువులకు పరిశుభ్రమైన వాతావరణం అవసరం, లేకుంటే వారు త్వరగా ఇన్ఫెక్షన్లకు గురవుతారు.

బిడ్డను ముద్దుపెట్టుకోకూడదా..?

నెలలు, రోజుల వయస్సు కలిగిన బిడ్డను పెదవులపై ముద్దు పెట్టుకోవడం సురక్షితం కాదు. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఏదైనా వ్యాధి బారిన పడినప్పుడు చిన్నారులను తాకకపోవడం ఉత్తమమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. జలుబు లేదా ఇన్ఫెక్షన్ల సమయంలో శిశువుల నుదిటిపై లేదా శరీరంలోని ఇతర భాగాలపై ముద్దు పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా నవజాత శిశువులను ఎత్తుకునేముందు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి.  

ఇవి గుర్తుంచుకోండి.. 

మీరు లిప్ స్టిక్, లిప్ గ్లాస్ లేదా క్రీమ్ అప్లై చేసినప్పుడు, చిన్నారులను ముద్దు పెట్టుకోవడం సురక్షితం కాదు. ఫ్లేవర్డ్ క్రీమ్ లేదా లిప్ గ్లాస్   పిల్లలకు హానికరం.  

 ఇది కూడా చదవండి.. పోషకాల ఘని బెల్లం 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.