పిల్లలలో థైరాయిడ్ సమస్యలు లక్షణాలు,నివారణ..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కొన్ని సంవత్సరాల క్రితం వరకు, థైరాయిడ్ సమస్య అనేది పెద్దలకు సంబంధించిన సమస్యగా మాత్రమే కనిపించేది. అయితే ప్రస్తుతం థైరాయిడ్ వ్యాధి పిల్లలకు కూడా వస్తోంది. థైరాయిడ్  సమస్యను నివారించడానికి ముందుగా పిల్లలలో కనిపించే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. అది ఎలాగో తెలుసుకుందాం..
 
హార్మోన్ల ఉత్పత్తి.. 

థైరాయిడ్ అనేది గొంతు దగ్గర సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి. ఇది గుండె, మెదడుతోపాటు ఇతర శరీర భాగాలు సక్రమంగా పని చేయడానికి సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. మామూలు భాషలో చెప్పాలంటే ఈ గ్రంథి శరీరంలో బ్యాటరీ వలె పనిచేస్తుంది. 

శరీరంలో అధికంగా హార్మోన్లు ఎక్కువగా ఉంటే " హైపర్ థైరాయిడిజం" అని , తక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం అని అంటారు. హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయితే కొన్నిరకాల సమస్యలు తలెత్తుతాయి. తగ్గితే కూడా ఇంకొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు లేని కారణంగా చాలా మందిలో థైరాయిడ్ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

పిల్లలలో టీ.ఎస్.హెచ్ స్థాయి..?

థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్(టీ.ఎస్.హెచ్) పరీక్ష ద్వారా థైరాయిడ్ లెవల్స్ ను గుర్తించవచ్చు. 0 నుంచి 2 వారాల శిశువులో టీ.ఎస్.హెచ్ స్థాయి 1.6-24.3 mU/L ఉండాలి. అదే 2 నుంచి 4 వారాల పిల్లలలో టీ.ఎస్.హెచ్ సాధారణ స్థాయి 0.58-5.57 mU/L గా ఉండాలి. 20 వారాల నుంచి 18 సంవత్సరాల పిల్లలలో థైరాయిడ్ సాధారణ స్థాయి 0.55-5.31 mU/L గా ఉంటుంది. గుర్తుంచు కోండి.. వీటి కంటే ఎక్కువ లేదా తక్కువ టీ.ఎస్.హెచ్ స్థాయి  కలిగి ఉంటే థైరాయిడ్ సమస్య ఉన్నట్లే.

 పిల్లలలో థైరాయిడ్ కు కారణాలు.. 

ఇటీవల చాలా మంది చిన్నారుల్లో థైరాయిడ్ సమస్య పుట్టుకతోనే వస్తోంది. అంతే కాకుండా బిడ్డ నెలలు నిండకుండా పుడితే కూడా కొందరిలో థైరాయిడ్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను నివారించడానికి, తల్లి గర్భం నుండే బిడ్డకు సరైన పోషకాహారాన్ని అందించాలి.

హషిమోటో థైరాయిడిటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా థైరాయిడ్‌కు కారణం కావచ్చు. అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ ప్రోబ్లమ్స్ తలెత్తుతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది శరీరం రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిని దెబ్బతీయడం ప్రారంభించే పరిస్థితి. తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డకు సరైన పోషకాహారం అందకపోతే థైరాయిడ్ సమస్యలు రావచ్చు.

పిల్లలలో థైరాయిడ్ వ్యాధి లక్షణాలు 

- పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల తగ్గుతుంది 
-పిల్లలు అలసిపోయినట్లు అనిపిస్తుంది 
-త్వరగా అనారోగ్యానికి గురవుతారు 
- పిల్లల చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది 
ఎముకలు, జుట్టు, దంతాలు బలహీనమవుతాయి 
-మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
- ఊబకాయం సమస్య.
-థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరగడం.
-కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం.

థైరాయిడ్ నివారణ.. 

-మొదట పిల్లలలో థైరాయిడ్ లక్షణాలను గమనించిన వెంటనే  తల్లిదండ్రులు ఖచ్చితంగా సంబంధిత వైద్యుడిని సంప్రదించాలి.
-హైపోథైరాయిడిజం ఉన్న పిల్లలకు, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చికిత్స చేస్తారు. అంతే కాకుండా కొన్ని మందుల ద్వారా కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

-హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న పిల్లల చికిత్స కోసం, మందులు, శస్త్రచికిత్సలు చేస్తారు.
-థైరాయిడ్ కారణంగా పిల్లల శారీరకంగానే కాకుండా మానసిక ఎదుగుదలపై కూడా ప్రభా వం చూపిస్తుంది. 
-దీన్ని నివారించాలంటే సరైన వైద్యంతో పాటు పౌష్టికాహారంపై కూడా శ్రద్ధ పెట్టాలి.
-పుట్టుకతో వచ్చే థైరాయిడ్ వ్యాధిని గుర్తించేందుకు, పుట్టిన కొద్ది రోజుల్లోనే పిల్లల టీ.ఎస్.హెచ్ పరీక్ష చేయించాలి.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.