పోలియో అంటే ఏమిటి..లక్షణాలు, నివారణ పద్ధతులు..
సాక్షి లైఫ్ : పోలియో అనేది ఐదుసంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. ప్రజల్లో పోలియో చుక్కల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడంతోపాటు పోలియోను అంత మొందించేందుకు ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు. పోలియో చరిత్ర, పోలియో లక్షణాలు, నివారణ పద్ధతులను తెలుసుకుందాం..
ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 23న జరుపుకుంటారు. ఈ రోజున, పోలియో చుక్కల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తారు. ఈ రోజున, పోలియో నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా పోలియోకు వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి.. విటమిన్ కె లోపంవల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ప్రపంచ పోలియో దినోత్సవం చరిత్ర ఏమిటి..?
ప్రపంచ పోలియో దినోత్సవాన్నిరోటరీ ఇంటర్నేషనల్ ప్రారంభించింది. పోలియో వ్యాక్సిన్‌ను కనుగొన్న మొదటి బృందానికి జోనాస్ సాల్క్ నాయకత్వం వహించారు. అక్టోబర్ 24వతేదీన జోనాస్ సాల్క్ పుట్టినరోజు సందర్భంగా ప్రతిఏటా వరల్డ్ పోలియో డేను జరుపుకుంటారు.
1988లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి పోలియోను నిర్మూలించే మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిషన్ ద్వారా ఈ వ్యాధి నుంచి రక్షించడానికి పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి పెట్టారు. ప్రపంచ పోలియో దినోత్సవం ఈ కార్యక్రమంలో భాగమే.
ప్రాముఖ్యత ఏమిటి..?
పోలియో ఒకప్పుడు భయంకరమైన వ్యాధి. కానీ ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగింది. గతంలో చాలామంది దీని బారిన పడేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. పోలియో సోకితే పక్షవాతం కూడా వస్తుంది. ఇది ఎక్కువగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సంభవిస్తుంది, కాబట్టి అలాంటి పిల్లలకు అన్ని టీకాలు సకాలంలో ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లలకు పోలియో చుక్కలు లేదా టీకాలు తప్పనిసరిగా వేయించాలి. 2014లో భారతదేశం పోలియో రహిత దేశంగా అవతరించింది.
పోలియో అంటే ఏమిటి..?
పోలియాను "పోలియోమైలిటిస్" అని కూడా అంటారు. ఇది పోలియో వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా సంభవిస్తుంది. ఇది వెన్నుపాము, నరాలను ప్రభావితం చేస్తుంది. ఇది పక్షవాతం లేదా మరణానికి కూడా కారణం కావచ్చు. పోలియో వైరస్ మొదట గొంతులో తరువాత ప్రేగులకు సోకుతుంది. దీని కారణంగా, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని తర్వాత ఇన్ఫెక్షన్ మెదడు, వెన్నుపాముపై ప్రభావం చూపుతుంది.
ఇది కూడా చదవండి.. కొబ్బరి నీళ్లతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో..
పోలియో ఎలా వ్యాపిస్తుంది..?
టాయిలెట్‌కి వెళ్లిన తర్వాత చేతులు సరిగా కడుక్కోకపోవడం
మురికి నీరు తాగడం
సోకిన వ్యక్తి ఉమ్మి, లాలాజలం తాకడం
మురికి నీటిలో ఈత కొట్టడం
పరిశుభ్రత లేని ఆహారం తినడం
పోలియో లక్షణాలు..?
గొంతు మంట
జ్వరం
తలనొప్పి
కడుపు నొప్పి
వాంతి
విరేచనాలు
ఆయాసం
కండరాల నొప్పి
కాళ్లు లేదా చేతులు కదలడంలో ఇబ్బంది
పక్షవాతం
నివారణ.. ?
పోలియో నివారణకు ఏకైక మార్గం పోలియో టీకా. భారతదేశంలో ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇస్తారు. 5 సంవత్సరాల లోపు ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేస్తారు.
ఇది కూడా చదవండి.. ట్రాన్సిషనల్ కేర్ అంటే ఏమిటి..? ఎలాంటివారికి అవసరం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
