నిద్రలో వచ్చే కలలు రియల్ గా జరుగుతాయా..? మానసిక నిపుణులు ఏం చెబుతున్నారు..?
సాక్షి లైఫ్ : నిద్రలో వచ్చే కలలు నిజజీవితంలో జరుగుతాయా..? అసలు కలలకు మనిషికి ఏమిటి సంబంధం..? శాస్త్రీయ పరంగా దీనికి సంబంధించి ఆధారాలేమైనా ఉన్నాయా..? కలలకు ఆలోచనలే కారణమా..? కలలను ఏవిధంగా అర్థం చేసుకోవాలి..? అనే విషయాలను గురించి మానసిక నిపుణులు ఏమంటున్నారు..? పరిశోధనలు ఏం చెబుతున్నాయి..? ఇప్పుడు తెలుసుకుందాం..
మనిషి ఎక్కువగా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడో అందుకు సంబంధించిన కలలే వస్తాయట. అసలు కలలకు ప్రాణం పోసేది మనస్సే. మనస్సులో వచ్చే ఊహలు, ఆలోచనలే కలలకు జీవం పోస్తాయి.
కొంతమందికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటే.. గుళ్ళు గోపురాలు దర్శించడం, ఆలయాల్లో పూజలు చేయించడం, ఇంటివద్ద పూజగదిలో గంటల కొద్దీ దేవతార్చన చేయడం వంటి నిత్యకృత్యాలతోనే ఎక్కువగా గడుపుతారు. ఇలా దైవ చింతనలో ఉండేవారికి వచ్చే కలలు కూడా అందుకు సంబంధించినవే ఎక్కువగా వస్తాయని మానసిక నిపుణులు హిప్నో పద్మాకమలాకర్ చెబుతున్నారు.
నిజజీవితంలో సాధ్యంకాని తీర్థయాత్రల దర్శనం కూడా స్వప్నావస్థలో చేసుకొనేవీలు కలుగుతుంది. అంతేకాదు ఆయా పుణ్య క్షేత్రాల్లోని పరిసరాలు, ప్రకృతి యధాతధంగా చూసిన అనుభూతి కూడా కలుగుతుందని ఆమె వెల్లడిస్తున్నారు. కొంతమందిలో రాత్రికి దాదాపు రెండు గంటలు పాటు కూడా కలలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. మరికొందరిలో అయితే ఒక్కోకల ఐదు నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉంటుందని సైకాలజిస్టు పద్మాకమలాకర్ వెల్లడిస్తున్నారు.
రాపిడ్ ఐ మూవ్ మెంట్..
కలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని "ఒనిరియాలజీ " అంటారు. నిద్రలో కలలు వచ్చేస్థితిని ఇంగ్లీష్ లో "రాపిడ్ ఐ మూవ్ మెంట్" అని అంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనుగుడ్లు వేగంగా కదులుతూ ఉంటాయి. కాబట్టే కలలను "రాపిడ్ ఐ మూవ్ మెంట్" గా వ్యవహరిస్తారు.
డీప్ స్లీప్ దశలోనే మనిషి కలలు కనడం జరుగుతుంది. సాధారణంగా తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయంటారు. కలలు ఎక్కువగా తెల్లవారు జామునే వస్తాయి. నిద్రావస్థ చరమ దశ తెల్లవారుజాము కాబట్టి ప్రయత్నిస్తే ఆ సమయంలోని కలలను గుర్తు పెట్టుకొన గలిగే అవకాశం వుంది. కొందరికి అర్థరాత్రి 2నుంచి 3 గంటల సమయంలో మెలకువ వస్తే ఇక నిద్ర పట్టదు.
నిద్ర ఫలితం..
అయినా కళ్లు మూసుకొని పడుకొనటం వల్ల మెదడు, కళ్లు సేద దీరుతాయి. మెలకువ వున్నప్పటికీ కళ్లు మూసుకొని పడుకొంటే మెదడు చేతనావస్థలో వుండి కూడ నిద్ర ఫలితం కొంతమేర దక్కుతుంది. నిద్రపట్టలేదు, మెలకువ గానే ఉన్నామను కొన్నప్పటికీ ఆ సమయంలో కూడా వచ్చిన కలలను గమనించేందుకు వీలుకలుగుతుంది.
సహజంగా కలలు..
నిద్రలో కలలు రావడం సాధారణమైన విషయం, అంత మాత్రాన నిద్ర సరిగ్గా పట్టడంలేదని ఆందోళన చెందనవసరం లేదు. సృజనాత్మకత ఎక్కువగా ఉన్నవారికి సహజంగా కలలు ఎక్కువగా వస్తాయి. భయం పుట్టే కలలు వచ్చినపుడు మాత్రం గుండె కొట్టుకునే, ఊపిరి పీల్చే వేగంలో మార్పులు కనిపిస్తాయి.
కలలు నిజమవుతాయనేది కేవలం అపోహ మాత్రమే..
కొన్నిసార్లు ఇలాంటప్పుడు మెలకువ రావొచ్చు. సాధారణంగా తెల్లవారు జామున ముందు రోజు చేసిన పనుల తాలూకూ ఆలోచనలకు సంబంధించిన కలలే ఎక్కువగా వస్తాయి. కల ఎప్పుడో యాదృచ్ఛికంగా నిజం కావొచ్చు తప్ప వేకువన వచ్చే కలలు నిజమవుతాయనేది కేవలం అపోహ మాత్రమే అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
మానసిక నిపుణులు..
కలలు ఎక్కువగా వేధిస్తున్నపుడు పగటిపూట సంతోషకరమైన అంశాలపైన దృష్టి పెట్టాలి. కలలకు అంత ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర విషయాలమీదనే దృష్టి పెట్టాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
భావోద్వేగాల అనుభూతులే..
నిద్రలోని కొన్ని దశల్లో భాగంగా మనస్సులో అసంకల్పితంగా సంభవించే ఆలోచనలు, భావోద్వేగాల అనుభూతులే కలలు. అంతేగానీ అటువంటి వాటిని ఆధారంగా చేసుకొని ఇలా అయితే మంచి జరుగుతుందని, అలా అయితే చెడు జరుగుతుందని నిర్ధారించలేమని మానసిక నిపుణులు తేల్చి చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
