For Better Sleep : కంటినిండా నిద్ర కరువైందా..? సుఖనిద్ర కోసం ఇలా చేయండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రోజంతా కష్టపడి అలిసిపోయినా రాత్రి పూట నిద్ర పట్టడం లేదా..? పడకపైకి చేరగానే నిద్ర మాయమై, అటూ ఇటూ దొర్లుతూ రాత్రంతా గడిపేస్తున్నారా..? అయితే, మీరు పడుకునే ముందు చేసే పనులపై కాస్త శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఆధునిక జీవనశైలిలో అర్ధరాత్రి వరకు మొబైల్ వాడటం, నిద్రకు సరైన సమయం లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మంది నిద్రలేమి (Insomnia) తో బాధపడుతున్నారు. ఆయుర్వేదం కూడా ప్రశాంతమైన నిద్ర కోసం కొన్ని మంచి అలవాట్లను సూచిస్తోంది. ఈ ఆరు చిన్న మార్పులతో మీ రాత్రివేళ దినచర్యను మార్చుకుంటే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..? 

ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?  

 

1. గదిలో చీకటిగా, ఎలాంటి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా..

నిద్రపోవడానికి మీ గదిలో చీకటిగా, ఎలాంటి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. పడకపైకి వెళ్లగానే రోజంతా జరిగిన విషయాలు, కోపం, ఆందోళనలను పక్కన పెట్టేయండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంతో పాటు మెదడుకు కూడా పూర్తి విశ్రాంతి దొరుకుతుంది.

2. ఉదయం నిద్రలేచే సమయం ఫిక్స్ చేసుకోండి..

రాత్రి తొందరగా నిద్ర పట్టాలంటే, ఉదయం లేచే సమయం కూడా ఒక క్రమపద్ధతిలో ఉండాలి. ప్రతిరోజూ ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ శరీరంలోని జీవ గడియారం (biological clock) సెట్ అయ్యి, రాత్రి వేళ సరైన సమయానికి నిద్ర వస్తుంది.

3. నిద్ర రాకపోతే ధ్యానం చేయండి..

పరుపుపైకి వెళ్లిన తర్వాత కూడా మీ మెదడు ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, కాసేపు కళ్లు మూసుకుని ధ్యానం (Meditation) చేయండి. మనసును ప్రశాంతపరుచుకోవడానికి నెమ్మదైన గొంతుతో మీకు ఇష్టమైన మంత్రాలు, భజనలు లేదా శ్లోకాలను జపించవచ్చు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది.

4. శారీరకంగా అతిగా అలిసిపోవద్దు..

రోజంతా చురుకుగా ఉండటం ఆరోగ్యానికి మంచిదే. కానీ, అవసరానికి మించి శ్రమించడం వల్ల ఒళ్లు నొప్పులు, తీవ్రమైన అలసట పెరిగి అది నిద్రకు భంగం కలిగించవచ్చు. ఇలాంటి సమయాల్లో శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి. అవసరమైతే నెమ్మదిగా మసాజ్ చేసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

5. ష్టమైన దుప్పటి లేదా దిండు వెంట తీసుకెళ్లండి..

చాలా మందికి ఇల్లు వదిలి వేరే ఊరు వెళ్లినప్పుడు లేదా కొత్త ప్రదేశాల్లో నిద్ర పట్టదు. అలాంటివారు తమ వెంట ఇంట్లో వాడే సుపరిచితమైన వస్తువులను తీసుకెళ్లడం మంచిది. ఉదాహరణకు, మీకు ఇష్టమైన దుప్పటి లేదా దిండు వెంట తీసుకెళ్లండి. ఆ పరిచయమైన వాసన లేదా స్పర్శ కొత్త వాతావరణంలో కూడా సౌకర్యవంతంగా అనిపించి నిద్ర పట్టేలా చేస్తుంది.

6. స్క్రీన్ టైమ్, భారీ భోజనానికి దూరం..

నిద్రపోవడానికి కనీసం 1 నుంచి 2 గంటల ముందు మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండండి. రాత్రి భోజనం ఎప్పుడూ నిద్రకు 2 నుంచి 3 గంటల ముందే ముగించాలి. మసాలాలు, నూనెలు ఎక్కువగా ఉండే భారీ భోజనం మానుకోవాలి. పడుకునే ముందు ఆకలిగా అనిపిస్తే, ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం లాంటి తేలికపాటి ఎంపికలు మంచివి.

 

ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.