Brain Fog : ఏకాగ్రతను పెంచే అమేజింగ్ హెల్త్ హ్యాబిట్స్
సాక్షి లైఫ్ : గదిలోకి ఎందుకు వెళ్లామో మర్చిపోవడం, మాట్లాడుతుంటే సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, చేస్తున్న పనిపై ఏకాగ్రత నిలపలేకపోవడం.. ఇలాంటివి తరచుగా మీకు ఎదురవుతున్నాయా? అయితే మీరు 'బ్రెయిన్ ఫాగ్' (Brain Fog) బారిన పడినట్లే. మెదడుపై ఏదో పొర కమ్మేసినట్లుగా ఉండి, స్పష్టంగా ఆలోచించలేకపోవడాన్నే బ్రెయిన్ ఫాగ్ అంటారు. నిద్రలేమి, ఒత్తిడి, డీహైడ్రేషన్, పోషకాహార లోపం, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. కొన్నిసార్లు హార్మోన్ల మార్పులు, మందుల ప్రభావం, లేదా ఏదైనా అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఈ సమస్యను అధిగమించి, తిరిగి ఏకాగ్రతను పెంచుకోవడానికి జీవనశైలిలో ఈ చిన్నపాటి మార్పులు చేసుకోండి.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
బ్రెయిన్ ఫాగ్‌ను జయించే సులభమైన చిట్కాలు..
1. నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు..
రాత్రిపూట ఎక్కువ సేపు మొబైల్ చూడటం వల్ల నిద్ర పాడవుతుంది. ఇది మరుసటి రోజు మీ ఆలోచనా విధానం, ఏకాగ్రతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయం వేళకు నిద్రలేవడం అలవాటు చేసుకోండి.
2. నీళ్లు తగినంత తాగాలి..
పని ఒత్తిడిలో పడి చాలామంది నీళ్లు తాగడం మర్చిపోతుంటారు. శరీరంలో నీటి శాతం తగ్గితే నీరసంగా, బద్ధకంగా అనిపించి మెదడు చురుకుదనం తగ్గుతుంది. కాబట్టి రోజులో కొద్దికొద్దిగా తగినంత నీరు తాగుతూ ఉండాలి.
3. శారీరక శ్రమ అవసరం..
గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల శరీరం మొద్దుబారుతుంది. రోజూ కొంత సమయం నడక, యోగా, స్ట్రెచింగ్ లేదా చిన్నపాటి వ్యాయామాల కోసం కేటాయించండి. ఇది రోజంతా యాక్టివ్‌గా ఉంచడంతో పాటు మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
4. పోషకాహారం తీసుకోవాలి..
కడుపు నింపే ఆహారం కన్నా.. పోషకాలున్న ఆహారం ముఖ్యం. మీ డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోండి. ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
5. ఒత్తిడికి చెక్ పెట్టండి..
పనులు, బాధ్యతలు, ఇతర ఆందోళనల వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగితే ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు. అందుకే రోజులో కొంత సమయం మీ కోసం కేటాయించుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, ధ్యానం (meditation), లేదా మీకు ఇష్టమైన పనులు చేయడం వల్ల మనసుకు ప్రశాంతత దొరుకుతుంది.
6. ఒకేసారి ఒకే పని..
ఒకేసారి చాలా పనులు (multitasking) చేయాలనుకుంటే ఏకాగ్రత దెబ్బతింటుంది. పనులు మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఒక పనయ్యాకే మరొకటి మొదలుపెట్టండి. ముఖ్యమైన పనుల కోసం 'టు-డూ లిస్ట్' (To-do list) రాసుకోవడం అలవాటు చేసుకోండి.
7. విరామం తప్పనిసరి..
ఏకధాటిగా సిస్టమ్ ముందు కూర్చుని పనిచేయడం వల్ల ఫోకస్ క్రమంగా తగ్గుతుంది. మధ్యమధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. స్క్రీన్‌కు కాస్త దూరంగా జరిగి అటూఇటూ నడవాలి. బ్రేక్ తర్వాత మళ్లీ పని మొదలుపెడితే మెరుగైన ఏకాగ్రతతో పనిచేయగలుగుతారు.
నిర్లక్ష్యం చేయకూడదు..
బ్రెయిన్ ఫాగ్ సమస్య మరీ ఎక్కువగా ఉండి, దీర్ఘకాలం పాటు వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మీ రోజువారీ పనులు, చదువు లేదా ఉద్యోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అనిపిస్తే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి సరైన సలహా తీసుకోవడం బెటర్.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
