Saliva : నిద్రలో దిండు తడుస్తోందా..? అయితే ఈ వ్యాధులకు సంకేతం కావొచ్చు..!
సాక్షి లైఫ్ : చిన్నపిల్లలు నిద్రలో ఉన్నప్పుడు నోటి నుంచి లాలాజలం (Saliva) కారడం సహజమే. కానీ, పెద్దవారిలో ఇలా తరచూ జరుగుతుంటే మాత్రం తేలిగ్గా తీసిపారేయకూడదు. ఇది శరీరంలో వస్తున్న మార్పులకు, కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య పరిభాషలో దీన్ని 'సియలోరియా' (Sialorrhea) అంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..? దీనికి పరిష్కారాలేమిటో తెలుసుకుందాం..
లాలాజలం ఎక్కువగా ఎందుకు ఊరుతుంది..?
నోట్లో లాలాజలం అవసరానికి మించి ఉత్పత్తి కావడం, మింగడంలో ఇబ్బంది లేదా నోటి కండరాలపై నియంత్రణ లోపించడం దీనికి ప్రధాన కారణాలు. వీటితో పాటు మరికొన్ని అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. ఆహారపు అలవాట్లు.. అతిగా పుల్లటి లేదా తీపి పదార్థాలు తినడం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా తయార వుతుంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
నాడీ సంబంధిత వ్యాధులు..పార్కిన్సన్స్, పక్షవాతం (stroke), సెరిబ్రల్ పాల్సీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి నాడీ సంబంధిత (Neurological) సమస్యలు ఉన్నవారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్లు..గొంతు ఇన్ఫెక్షన్, సైనస్, టాన్సిల్స్, అలెర్జీలు, యాసిడ్ రిఫ్లక్స్ లేదా గర్భధారణ సమయంలో వచ్చే వికారం వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఇతర కారణాలు..కొన్ని రకాల మందుల వాడకం, పురుగులు కుట్టడం లేదా అడెనాయిడ్స్ వాపు కూడా దీనికి కారణం కావొచ్చు.
రాత్రి పూటే ఎందుకు కారుతుంది..?
దీనికి మనం పడుకునే భంగిమకు నేరుగా సంబంధం ఉంటుంది. బోర్లా లేదా ఒక పక్కకు తిరిగి పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల లాలాజలం సులభంగా బయటకు కారుతుంది. వెల్లకిలా పడుకునే వారిలో ఈ సమస్య తక్కువగా ఉంటుంది. అయితే, ఎప్పటి నుంచో ఒకే భంగిమలో పడుకునే వారికి హఠాత్తుగా ఈ సమస్య మొదలైతే.. అది అలెర్జీ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలకు సంకేతం కావచ్చు.
నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది..?
దీన్ని దీర్ఘకాలం పాటు విస్మరించడం మంచిది కాదు. నిరంతరం లాలాజలం కారడం వల్ల పెదాల చివర చర్మం పగిలి, పుండ్లు పడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఈ అదనపు లాలాజలం నిద్రలో శ్వాసనాళం గుండా ఊపిరితిత్తుల్లోకి చేరితే 'న్యుమోనియా' వచ్చే తీవ్రమైన ముప్పు ఉంటుంది.
పరిష్కార మార్గాలు ఏమిటి..?
రోజువారీ డైట్లో పుల్లటి, మితిమీరిన తీపి పదార్థాలను తగ్గించాలి. పళ్లు వచ్చే వయసులో ఉన్న పిల్లలకైతే చల్లటి వస్తువులను కొరకడానికి ఇవ్వడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. లాలాజల ఉత్పత్తిని తగ్గించే మందులు లేదా గ్రంథులకు బొటాక్స్ (Botox) ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా వైద్యులు దీనికి చికిత్స అందిస్తారు.
నోటి కండరాలను బలోపేతం చేయడానికి మోటార్ థెరపీ లేదా ఓరల్ అప్లయన్స్ థెరపీలు సహాయపడతాయి. సమస్య తీవ్రంగా ఉండి ఇతర చికిత్సలు పనిచేయనప్పుడు, లాలాజల గ్రంథులను క్లిప్ చేయడం లేదా వాటి దిశను మార్చడానికి శస్త్రచికిత్సను సూచిస్తారు. అత్యంత అరుదైన కేసుల్లో రేడియేషన్ థెరపీని కూడా ఉపయో గిస్తారు. నిద్రలో లాలాజలం కారడం అనేది నలుగురిలో మీకు ఇబ్బందికరంగా అనిపించినా, లేదా మీ రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
