Mental Stress : మానసిక ఒత్తిడి గురైన వారికోసం ‘గూగుల్ జెమిని’ సరికొత్త ఫీచర్.. 

షేర్ చేయండి:
Mental Stress : మానసిక ఒత్తిడి గురైన వారికోసం ‘గూగుల్ జెమిని’ సరికొత్త ఫీచర్.. 

సాక్షి లైఫ్ : మానసిక ఒత్తిడి, కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్న వారికి సాంకేతిక సాయం అందించేందుకు గూగుల్ తన ఏఐ చాట్‌బాట్ ‘జెమిని’ని సరికొత్తగా తీర్చిదిద్దింది. ఆత్మహత్య ఆలోచనలు లేదా స్వయంగా హాని చేసుకునే ప్రవృత్తి ఉన్నవారిని గుర్తించి, వారికి తక్షణమే నిపుణుల సాయం అందేలా ‘హెల్ప్ ఈజ్ అవైలబుల్’ (Help Is Available) అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

 సింగిల్ క్లిక్ తో..

యూజర్లు జెమినితో చాట్ చేస్తున్నప్పుడు వారి మాటల్లో మానసిక సమస్యల లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఈ మాడ్యూల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. ఇందులో ‘వన్ టచ్’ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. దీని ద్వారా యూజర్లు నేరుగా కాల్ చేయడం, మెసేజ్ పంపడం లేదా క్రైసిస్ హాట్‌లైన్ వెబ్‌సైట్‌లను సందర్శించడం వంటివి చేయవచ్చు. ఒకసారి ఈ ఫీచర్ యాక్టివేట్ అయితే, చాట్ ముగిసే వరకు అది స్క్రీన్‌పైనే కనిపిస్తూ యూజర్‌కు భరోసానిస్తుంది.

నేపథ్యం ఇదే..

గతంలో కొందరు వ్యక్తులు ఏఐ బాట్‌లతో సుదీర్ఘంగా సంభాషించిన తర్వాత ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూశాయి. ముఖ్యంగా అమెరికాలో ఓ వ్యక్తి జెమినిని తన భాగస్వామిగా భావించి, దాని సూచనల మేరకే తనువు చాలించాడని అతని కుటుంబం కోర్టును ఆశ్రయించింది. ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో గూగుల్ ఈ కీలక మార్పులు చేపట్టింది.

తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట.. 

 స్వయంగా హాని కలిగించుకునే ఆలోచనలను సమర్థించకుండా, అటువంటి విషయాలను ప్రోత్సహించకుండా జెమినికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. యూజర్ల మానసిక స్థితిని బట్టి వారిని వాస్తవ ప్రపంచంలోని వైద్య నిపుణులతో అనుసంధానించడమే లక్ష్యంగా గూగుల్ క్లినికల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ కొన్ని దేశాల్లో అందుబాటులోకి రాగా, భారత్ వంటి దేశాల్లో త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. టెక్నాలజీ కేవలం సమాచారానికే పరిమితం కాకుండా, ప్రాణాలను కాపాడే దిశగా అడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.