నడుము నొప్పి తగ్గాలంటే.. ఇలా చేయండి..   

షేర్ చేయండి:
నడుము నొప్పి తగ్గాలంటే.. ఇలా చేయండి..   

సాక్షి లైఫ్ : ఇటీవల కాలంలో సిటింగ్ జాబ్స్ పెరిగిపోయాయి. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడంతో బ్యాక్ పెయిన్ తో బాధపడేవారు సంఖ్య మరింతగా పెరుగుతోంది. నడుంనొప్పి ఉన్నవారు ఆ బాధ బయటకు చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువసేపు పడుకోవాల్సి వస్తుంటుంది. వెన్నునొప్పి వచ్చినప్పుడల్లా పెయిన్‌ కిల్లర్స్ వాడడం వల్ల  కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి నడుంనొప్పి తగ్గించుకునేందుకు కొన్నిచిన్న చిన్న టిప్స్ పాటిస్తే తగ్గిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

బాగా నడుము నొప్పిగా ఉన్నవాళ్లు ఖచ్చితంగా ఒత్తిడిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వెన్నెముక కండరాలు బలోపేతం చేయడంతోపాటు, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. చిన్న చిన్న టిప్స్‌తో నడుం నొప్పిని తగ్గించుకోవచ్చు. పడుకునే సమయంలో వెనుక భాగంపై ఒత్తిడి పడుతుంది. నడుంనొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల, కాళ్ళు ఎత్తుగా పెట్టడం వల్ల నడుంపై ఒత్తిడి తగ్గి కాస్త ఉపశమనం కలుగుతుంది.   

 ఉపశమనం పొందాలంటే..?

నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే..?  తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. నడుంనొప్పిని తగ్గించడంలో వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక వ్యాయామం చేసే సమయంలో నడుముకు సంబంధించిన ముఖ్యమైన కండరాలపై దృష్టిసారించి సరైన శిక్షణతో వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా కండరాలను సాగదీసే స్ట్రెచ్‌ ఎక్సర్‌సైజులు చేయడంవల్ల ఫలితం ఉంటుంది. 

వెన్ను సంబంధిత గాయాల ప్రమాదాన్ని తగ్గించడంలో వ్యాయామం సహాయపడుతుంది. నడుం నొప్పి తగ్గడం కోసం వారానికి కనీసం రెండుసార్లు నడుమును బలపరిచే వ్యాయామాలను చేయండి. ఎముకలు బలంగా ఉన్నప్పుడు నడుము నొప్పి వంటి సమస్యలు తలెత్తవు. బలహీనమైన ఎముకలు ఉన్నప్పుడు కచ్చితంగా నడుంనొప్పి ఇబ్బంది పెడుతుంది. కాల్షియం, విటమిన్‌ "డి" పుష్కలంగా తీసుకోవడం ద్వారా వెన్నెముకలోని ఎముకలకు బలం చేకూరుతుంది. అందుకే తప్పనిసరిగా కాల్షియం, విటమిన్‌ డి తీసుకోవడం మర్చిపోకండి. పాలు, పెరుగు, ఆకుకూరలు, విటమిన్‌ సప్లిమెంట్లు వంటి వాటిలో విటమిన్‌ డి ఉంటుంది.

ఎత్తు మడమల చెప్పులు.. 

నడుంనొప్పిని నివారించడం కోసం చెప్పుల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఎత్తు మడమల చెప్పులు ఎక్కువగా వేసుకునే వారికి నడుంనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ మడమ ఉన్న చెప్పులను ధరించండి. ఇవి మన నడుంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒక్క అంగుళం కంటే తక్కువ మడమ ఉంటేనే ఫలితం బాగుంటుంది. 

ఆఫీసులో.. 
 
ఆఫీసులో కూర్చున్నప్పుడు, నిలబడి ఉన్నప్పుడు సరైన భంగిమ పద్ధతులను పాటించండి. మనం కూర్చునే విధానం బట్టి కూడా నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే కూర్చున్నా, నిల్చున్నా కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి ప్రతిరోజూ గంటల తరబడి కంప్యూటర్‌ ముందు పని చేసేవారు మంచి కుర్చీని ఎంపిక చేసుకొని కూర్చోవాలి. లేదంటే నడుం నొప్పి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది.

ఓవర్ వెయిట్..  

నడుం నొప్పికి మరొక కారణం విపరీతమైన బరువు. ఎక్కువ బరువు ఉన్న వారిలోనూ నడుమునొప్పి విపరీతంగా వస్తుంది. బరువు తగ్గితే సహజంగానే నడుం నొప్పి నుంచి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గటం పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు, చిన్న చిన్న మార్పులతో నడుం నొప్పి ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  

ఇదికూడా చదవండి.. కెఫిన్ రహిత పానీయాల గురించి తెలుసా..?   

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.