Kidney Stones in Summer : సమ్మర్ లో 'కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ 7 సూత్రాలు తప్పనిసరి.. !

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎండలు ముదురుతున్న వేళ కిడ్నీ సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం, మూత్ర విసర్జనలో మంట వంటి ఫిర్యాదులతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య ఈ కాలంలో అధికంగా ఉంటోంది. డీహైడ్రేషన్ మొదలుకొని ఆహారపు అలవాట్ల వరకు అనేక అంశాలు కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 

ఎందుకీ సమస్య..?

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చెమట రూపంలో నీరు విపరీతంగా బయటకు పోతుంది. ఫలితంగా మూత్రం గాఢత పెరిగి, అందులోని వ్యర్థాలు, కాల్షియం ఆక్సలేట్ వంటి లవణాలు స్పటికాలుగా మారి రాళ్లుగా ఏర్పడతాయి.

చిన్నారుల్లోనూ.. 

ఆశ్చర్యకరంగా ఇప్పుడు 5 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో కూడా కిడ్నీ రాళ్ల కేసులు నమోదవుతున్నాయి. జంక్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్స్‌పై మోజు పెరగడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ లక్షణాలను గమనించండి..

మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన మంట, నొప్పి. నడుము వెనుక భాగం నుంచి కడుపు వరకు పెయిన్. మూత్రం ముదురు పసుపు రంగులో రావడం లేదా రక్తం కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. తరచుగా దాహం వేయడం, నోరు ఎండిపోవడం, నీరసం.

నిపుణుల సలహాలు.. 

ప్రశ్న : రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన అవుతుంటే ఏం చేయాలి..?

జవాబు : వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ సమస్యలు లేదా మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం వల్ల ఇలా జరగవచ్చు. సాయంత్రం తర్వాత నీటి వినియోగం తగ్గించి, టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది.

ప్రశ్న : మూత్రాన్ని ఆపుకోలేకపోతున్నారా..?

జవాబు: మూత్రాశయ సామర్థ్యం తగ్గినప్పుడు ఇలా జరుగుతుంది. బరువు అదుపులో ఉంచుకోవడంతో పాటు 'కీగెల్' వ్యాయామాలు చేస్తే మూత్రాశయ కండరాలు బలోపేతం అవుతాయి.

కిడ్నీలో రాళ్ల నివారణకు 7 ముఖ్యమైన చిట్కాలు

నీటి వినియోగం.. ప్రతిరోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల శుభ్రమైన నీటిని తాగాలి. ఉప్పు అధికంగా ఉండే జంక్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ప్యాక్డ్ ఫుడ్స్ మానుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మరసం వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, ద్రవ పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కార్బోనేటెడ్ పానీయాలు, సోడాలు కిడ్నీలలో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి, కాబట్టి వాటిని నివారించాలి. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఉంటుంది.

విపరీతంగా చెమట పట్టినప్పుడు ఓఆర్ఎస్ (ORS) తీసుకోవడం ద్వారా లవణాల సమతుల్యతను కాపాడుకోవచ్చు. రక్తపోటు (BP), మధుమేహం (Diabetes) ఉన్నవారు తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. సరైన జీవనశైలి, తగినంత నీటి వినియోగంతో ఈ వేసవిలో మీ కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.