కాలేయానికి చేటు చేసే 5 పొరపాట్లు..! మీ దైనందిన జీవితంలో జాగ్రత్త..!

షేర్ చేయండి:
కాలేయానికి చేటు చేసే 5 పొరపాట్లు..! మీ దైనందిన జీవితంలో జాగ్రత్త..!

సాక్షి లైఫ్ : కాలేయ సంబంధిత వ్యాధుల కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మన దైనందిన జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు కాలేయానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని, వీటిని సకాలంలో సరిదిద్దుకోకపోతే తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో, వాటిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

 కాలేయానికి హాని కలిగించే అలవాట్లు ఇవే!

 ఒత్తిడి (స్ట్రెస్):

మానసిక ఒత్తిడి కేవలం మెదడుకే కాదు, కాలేయానికి కూడా హానికరం. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరిగి కాలేయం పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు చాలా మంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లకు బానిసలవుతారు. ఇవి కాలేయానికి మరింత నష్టం కలిగిస్తాయి. యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం, సరిపడా నిద్రపోవడం, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.

 నిద్రలేమి.. 

శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపే ప్రక్రియలో (డిటాక్సిఫికేషన్) నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత నిద్ర లేకపోతే కాలేయం తన పనిని సరిగా నిర్వర్తించడంలో ఇబ్బంది పడి, విష పదార్థాలు శరీరంలోనే పేరుకుపోతాయి. ఇది ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ కనీసం 7-8 గంటలు నిద్రపోవడం, రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే లేచే అలవాటు చేసుకోవడం కాలేయ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.

 శారీరక శ్రమ లేకపోవడం.. 
 
ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. వ్యాయామం లేకపోతే శరీరంలో కొవ్వు పేరుకుపోయి, ఇది కాలేయంలో నిల్వ ఉండటం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలకు దారితీస్తుంది. నిశ్చల జీవనశైలి జీవక్రియను నెమ్మదింపజేసి, కాలేయంపై అధిక భారాన్ని మోపుతుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు చురుకైన నడక, యోగా లేదా ఏదైనా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఉపయోగించడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి నడవడం వంటివి పాటించడం ఆరోగ్యకరం.

డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం.. 

చాలా మంది చిన్నపాటి నొప్పులకు, ఇతర సమస్యలకు డాక్టర్ సలహా లేకుండా నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) లేదా ఇతర మందులు తీసుకుంటారు. పారాసెటమాల్, ఆస్పిరిన్ వంటి నొప్పి నివారణ మందులు అధిక మోతాదులో తీసుకుంటే కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే, వైద్యుడి సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ముందుగా వైద్యుడిని సంప్రదించి, వారి సూచనల మేరకే మందులు వాడాలి.

 జంక్ ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారం..  

నూనె, మసాలాలు అధికంగా ఉండే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర అధికంగా ఉండే పానీయాలు కాలేయానికి అత్యంత హానికరం. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, కృత్రిమ రసాయనాలు కాలేయంలో పేరుకుపోయి వాపు (ఇన్‌ఫ్లమేషన్), కొవ్వు కాలేయ వ్యాధి (ఫ్యాటీ లివర్ డిసీజ్)కి కారణమవుతాయి. తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, వేయించిన, తీపి పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ఈ ఐదు పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే, కాలేయ సంబంధిత వ్యాధులు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు పునరుద్ఘాటిస్తున్నారు. మీ కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలను పాటించడం తప్పనిసరి.

 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.