Mineral Water : మినరల్ వాటర్‌తోనూ ప్రాణగండమేనా..?
సాక్షి లైఫ్ : మనం ఎక్కడికైనా టూర్ కు వెళుతున్నా, బయటకు వెళ్లినా.. మనలో చాలామంది కళ్లు మూసుకుని తాగేది బాటిల్ వాటర్ మినరల్ వాటర్(mineral water). సాధారణ నీటి కంటే ఇది ఎంతో శుభ్రమైనదని, సురక్షితమైనదని నమ్ముతాం. అయితే, ఇటీవల దేశంలోని ఓ ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ నమూనాల్లో (samples) పరిమితికి మించి ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) గుర్తించడం, ఆ సంస్థపై విచారణకు అనుమతించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
పరీక్షించిన నీటి నమూనాల్లో ‘బ్రోమేట్’ (Bromate), ‘పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ (PAHs) అనే రసాయనాలు నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. సదరు కంపెనీ తమ నీరు సురక్షితమేనని, పరీక్షా ఫలితాలపై సందేహాలు ఉన్నాయని వాదిస్తున్నప్పటికీ.. అసలు ఈ రసాయనాలు నీటిలోకి ఎలా వస్తాయి..? వీటి వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందనే విషయాలను నిపుణుల విశ్లేషణ ఆధారంగా తెలుసుకుందాం..
అసలేమిటీ ‘బ్రోమేట్’..? నీటిలోకి ఎలా వస్తుంది..?
బ్రోమేట్ అనేది నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో అనుకోకుండా ఏర్పడే ఒక రసాయన ఉప-ఉత్పత్తి (By-product). సాధారణంగా నీటిలోని సూక్ష్మక్రిములను చంపడానికి కంపెనీలు ‘ఓజోన్’ (Ozone) గ్యాస్‌ను ఉపయోగిస్తాయి. నీటిలో సహజంగా ఉండే ‘బ్రోమైడ్’తో ఈ ఓజోన్ చర్య జరిపినప్పుడు ‘బ్రోమేట్’ ఏర్పడుతుంది.
నిబంధనల ప్రకారం.. తాగునీటిలో బ్రోమేట్ గరిష్ట పరిమితి లీటరుకు 10 మైక్రోగ్రాములు (10 µg/L) మించకూడదు. ఇటీవల సేకరించిన ఒక శాంపిల్‌లో ఇది లీటరుకు 12 మైక్రోగ్రాములుగా నమోదవడం ఆందోళనకు దారితీసింది.
బ్రోమేట్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు..
క్యాన్సర్ ముప్పు..ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుబంధ సంస్థ ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ (IARC) బ్రోమేట్‌ను ‘గ్రూప్ 2B’ .మనుషుల్లో క్యాన్సర్ కారకమయ్యే అవకాశం ఉన్న పదార్థం జాబితాలో చేర్చింది. కిడ్నీ, నరాలపై ప్రభావం..పరిమితికి మించి బ్రోమేట్ ఉన్న నీటిని దీర్ఘకాలం పాటు తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. లక్షణాలు..మోతాదు మరీ ఎక్కువగా ఉంటే వికారం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో పాటు నాడీ వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది.
‘పీఏహెచ్ఎస్’ (PAHs) అంటే ఏమిటి..?
పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) అనేవి బొగ్గు, చమురు, కలప వంటివి పూర్తిగా మండకపోవడం వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే రసాయనాల సమూహం. పరిశ్రమల వ్యర్థాలు, పెట్రోలియం లీకేజీలు, వాహన కాలుష్యం, వర్షపు నీటి ద్వారా ఇవి భూగర్భ జలాల్లోకి, నదుల్లోకి చేరుతాయి. నీటి శుద్ధి ప్లాంట్ల చుట్టుపక్కల పారిశ్రామిక కాలుష్యం ఎక్కువగా ఉన్నా, ఫిల్ట్రేషన్ ప్రక్రియలో లోపాలు తలెత్తినా ఇవి ప్యాకేజ్డ్ వాటర్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
పీఏహెచ్ఎస్ వల్ల కలిగే నష్టాలు..
ఈ రసాయన సమూహంలోని ‘బెంజోపైరీన్’ (Benzopyrene) వంటి కొన్ని రసాయనాలను IARC ‘గ్రూప్-1’ ఖచ్చితంగా క్యాన్సర్ కలిగించేవి.. వీటి ప్రభావం వల్ల ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది. కాలేయం (liver), కిడ్నీలు, చర్మ సంబంధిత సమస్యలకు కూడా ఇవి దారితీస్తాయని వైద్య నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
ఏం చేయాలి మరి..?
ప్రతి బాటిల్ వాటర్ కలుషితమైందని భయపడాల్సిన అవసరం లేదని, అయితే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నీటి బాటిల్ కొనేటప్పుడు సీల్ సరిగ్గా ఉందో లేదో, FSSAI లైసెన్స్ నంబర్, తయారీ తేదీ (Batch Number) స్పష్టంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి.
ఎండలో ఎక్కువ సేపు ఉంచిన ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిని తాగకపోవ డమే మంచిది. ఇంట్లో సాధారణ నీటిని బాగా మరిగించి, చల్లార్చి తాగడం లేదా నాణ్యమైన వాటర్ ప్యూరిఫయర్లను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ వాడటం అన్నింటికంటే సురక్షితమైన మార్గం.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
