Health Tips to Protect Your Heart and Brain : గుండె, మెదడును కాపాడే ఆరోగ్య సూత్రాలు ..
సాక్షిలైఫ్ : ఉరుకుల పరుగుల జీవితం, శారీరక శ్రమ లేకపోవడం, మారుతున్న ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలామంది మధుమేహం, అధిక రక్తపోటు (bp), గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఒకప్పుడు గుండెపోటు, పక్షవాతం (brain stroke) వృద్ధాప్యంలో మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు 30 ఏళ్ల లోపు యువతలోనూ ఇవి సర్వసాధారణం అయిపోయాయి.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమవుతుండగా.. పక్షవాతం, డిమెన్షియా వంటి మెదడు సంబంధిత సమస్యలు లక్షలాది మంది జీవితాలను కుంగదీస్తున్నాయి. అయితే మన దైనందిన జీవనశైలిలో కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ముప్పు నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గుండెకు, మెదడుకు ఉన్న అవినాభావ సంబంధం..
గుండె, మెదడు ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ఊబకాయం, ధూమపానం, తీవ్రమైన ఒత్తిడి.. ఇవన్నీ గుండె రక్తనాళాలకే కాకుండా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. గుండె ఆరోగ్యంగా లేనప్పుడు మెదడుకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందవు. దీనివల్ల పక్షవాతం, జ్ఞాపకశక్తి మందగించడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే, గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనం పాటించే చిట్కాలే మెదడును కూడా చురుగ్గా ఉంచుతాయని, ఒకే బాణంతో రెండు లక్ష్యాలను ఛేదించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
గుండె, మెదడును కాపాడే ఆ ఆరోగ్య సూత్రాలివే..
1. క్రమం తప్పని వ్యాయామం (Regular Exercise)..
రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, సైక్లింగ్ లేదా యోగా లాంటివి చేయడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇది రక్తప్రసరణను వేగవంతం చేసి మెదడుకు ఆక్సిజన్, పోషకాలను సమృద్ధిగా అందేలా చేస్తుంది. వ్యాయామం వల్ల శరీరంలో వాపులు, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు విడుదలై మెదడు ప్రశాంతంగా ఉంటుంది.
2. ఆరోగ్యకరమైన ఆహారం (Healthy Diet)..
గుండె, మెదడు పనితీరు మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ఉప్పు, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి రక్తపోటు, ఊబకాయాన్ని పెంచుతాయి. వీటికి బదులుగా నట్స్, గింజలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి రక్తనాళాలను శుభ్రంగా ఉంచి మెదడుకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి.
3. ఒత్తిడి, ధూమపానానికి దూరం..
నిరంతర ఒత్తిడి, పొగతాగే అలవాటు గుండె, మెదడు రెండింటినీ తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఒత్తిడి వల్ల శరీరంలో 'కార్టిసాల్' (Cortisol) అనే హార్మోన్ స్థాయిలు పెరిగిపోయి రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెపై అదనపు భారం మోపుతుంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవాలి.
4. కంటినిండా నిద్ర (Adequate Sleep)..
ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 9 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్రలో ఉన్నప్పుడు మెదడు తనను తాను మరమ్మతు చేసుకుని జ్ఞాపకాలను పదిలం చేసుకుంటుంది. అదే సమయంలో నిరంతరం పనిచేసే గుండెకు, రక్తనాళాలకు తగిన విశ్రాంతి దొరుకుతుంది. తద్వారా ఈ రెండు కీలక అవయవాలు మరుసటి రోజుకు తిరిగి ఉత్తేజం పొందుతాయి.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
