Electric Comb : బట్టతలకు ఎలక్ట్రిక్ దువ్వెన తో చెక్ పెట్టొచ్చు.. 97.85శాతం జుట్టు పెరుగుదల..
సాక్షి లైఫ్ : ప్రస్తుత తరంలో వయసుతో సంబంధం లేకుండా నేడు కోట్లాది మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం, బట్టతల (androgenetic alopecia) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 కోట్ల మంది దాదాపు 80శాతం మంది పురుషులు, 20 శాతం నుంచి 40శాతం మంది మహిళలు ఏదో ఒక దశలో జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు సరికొత్త పరిష్కారం చూపే దిశగా చైనాలోని బీజింగ్‌కు చెందిన బెయిహాంగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. వారు రూపొందించిన ‘డిటాంగిల్’ (Detangle) అనే వినూత్న ఎలక్ట్రిక్ దువ్వెన, ప్రయోగశాలలోని ఎలుకలపై అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో ప్రచురితమయ్యాయి.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఈ ఎలక్ట్రిక్ దువ్వెన ఎలా పనిచేస్తుంది..?
సాధారణంగా జుట్టు పెరుగుదల కోసం వాడే క్రీములు, లోషన్లు తల చర్మం పైపొరను దాటి కుదుళ్ల లోపలికి పూర్తిగా చేరలేకపోవడం ప్రధాన సమస్య. దీనికి పరిష్కారంగా శాస్త్రవేత్తలు విద్యుత్ తరంగాలను, జన్యు చికిత్సను కలిపి ఈ దువ్వెనను తయారు చేశారు.
ప్రత్యేకమైన పళ్ల అమరిక..
ఈ దువ్వెన పళ్ళు ఒకటి పొడవుగా, మరొకటి పొట్టిగా ఉండేలా డిజైన్ చేశారు. దీనివల్ల ఉత్పత్తయ్యే పల్స్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ (స్వల్ప విద్యుత్ క్షేత్రం) సాధారణ పద్ధతుల కంటే 2.5 రెట్లు అధిక ప్రభావవంతంగా పనిచేస్తుంది.
లోతుగా చేరే ఔషధం..
ఈ విద్యుత్ తరంగాలు తల చర్మంలోని రంధ్రాలను తాత్కాలికంగా తెరుస్తాయి. ఫలితంగా, దువ్వెనలోని రెండు ప్రయోగాత్మక జన్యు ఔషధాలు (SRD5A2 siRNA, VEGFA ప్లాస్మిడ్స్) సాధారణ క్రీముల కంటే 9 రెట్లు లోతుగా వెంట్రుకల కుదుళ్లలోకి చేరుతాయి.
కుదుళ్లకు కొత్త బలం..
ఈ చికిత్స ఒకవైపు జుట్టు రాలడానికి కారణమయ్యే ‘డీహెచ్‌టీ’ (DHT) అనే హార్మోన్ ప్రభావాన్ని అడ్డుకుంటుంది. మరోవైపు, వెంట్రుకల కుదుళ్ల చుట్టూ కొత్త రక్తనాళాలు పెరిగేలా ప్రోత్సహించి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.
ప్రస్తుత చికిత్సలతో పోలిస్తే..
ప్రస్తుతం బట్టతల నివారణకు వైద్యులు ప్రధానంగా ‘మినాక్సిడిల్’ లోషన్, ‘ఫినాస్టెరైడ్’ మాత్రలను సూచిస్తున్నారు. 28 రోజుల పాటు ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో వెలువడిన ఫలితాలు ఇలా ఉన్నాయి.
ఫినాస్టెరైడ్..
సుమారు 50శాతం జుట్టు పెరుగుదల కనిపించింది. అయితే, మనుషుల్లో దీని దీర్ఘకాలిక వాడకం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గడం, మానసిక ఒత్తిడి వంటి దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది.
మినాక్సిడిల్..
సుమారు 70శాతం జుట్టు తిరిగి వచ్చింది. కానీ, దీనిని నిరంతరా యంగా వాడాల్సి ఉంటుంది. ఫలితాలు కూడా వ్యక్తిని బట్టి మారుతుంటాయి. దువ్వెన ఔషధంతో..ఏకంగా 97.85శాతం జుట్టు తిరిగి పెరగడం విశేషం.
మరి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా..?
ఈ ప్రయోగ ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఈ దువ్వెన సామాన్యులకు అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎలుకలపై కృత్రిమంగా సృష్టించిన బట్టతలకు, మనుషుల్లో ఏళ్ల తరబడి సహజంగా వచ్చే బట్టతలకు చాలా తేడా ఉంటుంది. ఎలుకల్లో వచ్చిన అద్భుత ఫలితాలు మనుషుల్లోనూ అదే స్థాయిలో వస్తాయా లేదా అనేది క్లినికల్ ట్రయల్స్ ద్వారా తేలాల్సి ఉంది.
పరీక్షలు అవసరం..ఈ దువ్వెనలో వాడిన జన్యు ఔషధాలు మానవ శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపకుండా సురక్షితంగా పనిచేస్తాయని నిర్ధారించుకోవాల్సి ఉంది. మొత్తానికి, ఖరీదైన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సలు, దుష్ప్రభావాలు కలిగించే మాత్రలకు ప్రత్యామ్నాయంగా భవిష్యత్తులో ఇలాంటి సులువైన, సురక్షితమైన చికిత్సలు అందుబాటులోకి వచ్చే దిశగా ఈ పరిశోధన కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
