వినికిడి సమస్యలకు కారణమేంటి..?
సాక్షి లైఫ్ : స్మార్ట్ ఫోన్..లేనివారుండరంటే అతిశయోక్తి కాదు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. అసలు ఫోన్ లేకుండా నిమిషం గడవడం చాలా కష్టమవుతోందేమో అన్నంతగా స్మార్ట్ ఫోన్ అవసరం ఏర్పడింది. ఏదైనా వస్తువు వాడేటప్పుడు ఆరోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం విషయంలో అలా జరగడంలేదు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా కళ్ళ సమస్యలు, వినికిడి సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
250 కోట్ల మంది వినికిడి సమస్యల బారీన పడే ప్రమాదం..
హెడ్ ఫోన్స్, ఈయర్ బడ్స్ ఎక్కువ సమయం వాడడం వల్ల వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయి. 2050 నాటికి దాదాపు 250 కోట్ల మంది వినికిడి సమస్యల బారీన పడే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు 70కోట్ల మందికి వినికిడి లోపాలకు చికిత్స అవసరమవు తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కంటే వంద కోట్ల కుపైగా యువకులు శాశ్వతంగా చెవిటివారిగా మారే ప్రమాదం ఉందని పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వినికిడి సమస్యలకు కారణాలు..
ముఖ్యంగా వినికిడి సమస్యలు గతంలో కేవలం వృద్ధాప్యంలో మాత్రమే తలెత్తేవి.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యలు యువకులలో కూడా వేగంగా పెరుగుతోంది. జీవనశైలి అలవాట్లే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఇయర్‌ఫోన్‌లను అతిగా వాడడం వల్ల చెవి సంబంధిత వ్యాధులతోపాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు, వినికిడి సమస్యలు రాకుండా ఉండాలంటే..? సరైన పోషకాహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
కొందరు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడానికి ఇష్టపడతారు. ప్రయాణంలో ఉన్నప్పుడు, ఇంట్లో పని చేస్తున్నప్పుడు లేదా ఆఫీసులో పని చేస్తున్నప్పుడు కూడా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఎక్కువసేపు పాటలు వింటున్నారు. ఎక్కువ సమయం వినడం వల్ల కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
చెవి ఇన్ఫెక్షన్ కారణంగా కొందరిలో చెవి క్యాన్సర్ కూడా వచ్చేప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. చెవి ఇన్ఫెక్షన్ ఉన్న వారు వాడిన అదే హెడ్‌ఫోన్ లేదా ఇయర్‌ఫోన్‌లను మరొకరు ఉపయోగిస్తే, వాళ్లు కూడా ఆ ఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటివి నివారించడానికి, హెడ్‌ఫోన్‌లను తక్కువగా ఉపయోగించండి. ముఖ్యంగా ఇతరుల ఇయర్‌ఫోన్‌లను అస్సలు వాడొద్దు. అంతే కాదు, ఇయర్‌ఫోన్‌ల ద్వారా ఎక్కువ సౌండ్ వినడం వల్ల చెవుల్లోని నరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..హెచ్.పి.వి వ్యాక్సిన్ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా కీలక ప్రకటన..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
