High Blood Pressure : ఐ విజన్ కూ ‘హైబీపీ’ ముప్పు.. లక్షణాలు లేకున్నా ప్రమాదమే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అధిక రక్తపోటు (hypertension) అనగానే గుండె జబ్బులు, మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలే మనకు మొదటగా గుర్తొస్తాయి. అయితే దీని ప్రభావం కంటిలోని అత్యంత సున్నితమైన రక్తనాళాలపై కూడా తీవ్రంగా పడుతుందని చాలామంది గుర్తించరు. కంటి వెనుక భాగంలో ఉండే రెటీనాలో అత్యంత సూక్ష్మమైన రక్తనాళాలు ఉంటాయి. రక్తపోటు నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల ఈ నాళాల నిర్మాణం దెబ్బతిని, రక్తప్రసరణలో మార్పులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల వచ్చే ప్రధాన ముప్పు ఏంటంటే.. ప్రారంభ దశలో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు బయటపడవు. చూపు మామూలుగానే ఉన్నట్లు అనిపించినా, లోలోపలే కంటికి తీవ్ర నష్టం వాటిల్లుతుంటుంది.

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

రెటీనాపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?

రక్తనాళాలపై నిరంతరం ఒత్తిడి పెరిగినప్పుడు అవి కుంచించు కుపోవడం లేదా వంకర్లు తిరగడం జరుగుతుంది. వ్యాధి ముదిరే కొద్దీ.. రెటీనాలో రక్తస్రావం..రక్తనాళాలు చిట్లి చిన్నపాటి రక్తస్రావం జరగవచ్చు. కాటన్-వూల్ స్పాట్స్.. రెటీనాలోని కొన్ని భాగాలకు రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు తెల్లటి మచ్చల వంటివి ఏర్పడతాయి. ఆప్టిక్ నర్వ్ వాపు..తీవ్రమైన సందర్భాల్లో కంటి నుంచి మెదడుకు సంకేతాలు పంపే ఆప్టిక్ నరం వాపునకు గురవుతుంది. వైద్య పరిభాషలో ఈ సమస్యను ‘హైపర్‌టెన్సివ్ రెటినోపతి’ అంటారు. సరైన సమయంలో గుర్తించకపోతే దృష్టి లోపం, చివరకు శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

లక్షణాలు కనిపించకపోవడమే అసలు సమస్య..

అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ ప్రకారం.. అధిక రక్తపోటుతో బాధపడే వారిలో చాలామందికి ప్రారంభంలో చూపులో ఎలాంటి మార్పూ కనిపించదు. సమస్య ముదిరిన తర్వాతే చూపు మసకబారడం, తరచూ తలనొప్పి రావడం, కంటి సమస్యలు బయటపడతాయి. మనం కేవలం అద్దంలో చూసుకుని ఈ మార్పులను గుర్తించలేం. కేవలం నేత్ర వైద్యుల వద్ద ప్రత్యేక పరీక్షల ( fundus examination) ద్వారానే రెటీనా నాళాల స్థితిని తెలుసుకోగలం.

బీపీ మందులతోనే సరిపెట్టుకోవద్దు..

 రక్తపోటు ఉన్నవారు కేవలం గోళీలు వేసుకుంటున్నాం కదా అని సరిపెట్టుకోకుండా, బీపీ నిజంగా అదుపులో ఉంటోందో లేదో క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. రక్తపోటు సమస్య ఉన్నవారు కనీసం ఏడాదికి ఒకసారైనా నేత్ర వైద్యుడిని సంప్రదించి సమగ్ర కంటి పరీక్ష చేయించుకోవాలి. ఉప్పు వాడకం తగ్గించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. దీనివల్ల కంటితో పాటు గుండె, మూత్రపిండాల ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.