Cervical Cancer : సర్వైకల్ క్యాన్సర్ పై పోరులో భారత్ సరికొత్త మైలురాయి..కేంద్రం, వైద్య సిబ్బంది కృషిపై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మహిళల ప్రాణాలను హరిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (cervical cancer) నివారణలో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జాతీయ హెచ్‌పీవీ (Human Papillomavirus) టీకా కార్యక్రమం ప్రారంభమైన తొమ్మిది నెలల్లోపే కోటి డోసుల మైలురాయిని దాటింది. ఈ అరుదైన ఘనత సాధించినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దక్షిణాసియా ప్రాంతీయ కార్యాలయం భారత్‌కు అభినందనలు తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశ వ్యాప్తంగా 14 ఏళ్ల వయసున్న బాలికలను లక్ష్యంగా చేసుకుని ఈ టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వార్షిక లక్ష్యంలో ఇప్పటివరకు సుమారు 87 శాతం మందికి టీకా అందించి రికార్డు సృష్టించారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

డబ్ల్యూహెచ్‌ఓ, ప్రధాని ప్రశంసలు..

ఈ విజయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం వ్యక్తం చేసింది. సర్వైకల్ క్యాన్సర్ నిరోధక పోరాటంలో ఇది అత్యంత కీలకమైన ముందడుగు అని పేర్కొంది. ఈ ఘనత వెనుక ప్రభుత్వం, వైద్య ఆరోగ్య సిబ్బంది, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషి ఉందని కొనియాడింది.

మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ మైలురాయిపై సంతోషం వ్యక్తం చేశారు. వ్యాధి నిరోధక ఆరోగ్య సేవల దిశగా ఇదొక గొప్ప అడుగు అని అభివర్ణించారు. బాలికలకు అందించే ప్రతి టీకా డోసు వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని, ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.

హెచ్‌పీవీ టీకా ఎందుకు కీలకం..?

హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ఇన్ఫెక్షన్ దీర్ఘకాలం పాటు శరీరంలో ఉండిపోతే, అది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. మహిళల్లో ఎక్కువగా కనిపించే ప్రమాదకర క్యాన్సర్లలో ఇదీ ఒకటి. క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రధాన హెచ్‌పీవీ రకాల నుంచి ఈ టీకా సమర్థవంతంగా రక్షణ కల్పిస్తుంది. కౌమార దశలో అంటే 14 ఏళ్ల వయసులో ఈ టీకా వేయించడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

టీకా వేయించుకున్నా పరీక్షలు తప్పనిసరి.. 

కోటి డోసుల పంపిణీ అనేది దేశ ప్రజారోగ్య రంగంలో గొప్ప విజయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, టీకా వేయించు కున్నంత మాత్రాన పూర్తిగా నిర్లక్ష్యం వహించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో మహిళలు వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించు కోవడం వల్ల వ్యాధిని పూర్తిగా నియంత్రించ వచ్చని స్పష్టం చేస్తున్నారు. టీకా కార్యక్రమంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరింత అవగాహన పెంచడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రహిత భారత్‌ను నిర్మించవచ్చని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.