మైగ్రేన్ కారణంగా గుండెపోటు వస్తుందా..?
సాక్షి లైఫ్ : మైగ్రేన్ పెయిన్ చాలా రోజుల నుంచి వేస్తూన్నట్లయితే, దానిని ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక్కోసారి హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
మైగ్రేన్ తలనొప్పి లక్షణాలు..
మైగ్రేన్ తలనొప్పి సాధారణ తలనొప్పి కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. దీనికి తీవ్రమైన శ్రద్ధ కూడా అవసరం ఎందుకంటే కొన్ని పరిస్థితులలో ఇది సైకోసోమాటిక్ డిజార్డర్ వల్ల వచ్చే సమస్యగా కూడా మారవచ్చని వైద్యులు చెబుతున్నారు.
నాడీ సంబంధిత సమస్య..
మైగ్రేన్ అనేది నాడీ సంబంధిత సమస్య. దీని కారణంగా తలకు ఒక వైపు తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి కారణంగా గుండె స్పందన వేగవంతమవుతుంది. వికారంగా ఉండడం, వాంతులు అవ్వడంతోపాటు ఎలాంటి సౌండ్ వినలేరు, ఎక్కువ సేపు లైటింగ్ వైపు కూడా చూడలేరు.
మైగ్రేన్ వల్ల వచ్చే సమస్యలు..
ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ కారణంగా ఎక్కువమంది చనిపోతున్నది స్ట్రోక్ వల్లనే. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.85 లక్షల మందికి పైగా మైగ్రేన్ బారీన పడుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
మైగ్రేన్, ఇస్కీమిక్ స్ట్రోక్..
మైగ్రేన్, ఇస్కీమిక్ స్ట్రోక్ మధ్య సంబంధం గురించి అనేక అధ్యయనాలలో ఇవి రెండూ రక్తనాళాల సరఫరాకు సంబంధించిన సమస్యలని తేలింది.
మైగ్రేన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, స్ట్రోక్ , కార్డియోవాస్కులర్ ప్రాణాపాయ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. గుండె జబ్బులు - పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మైగ్రేన్‌లతో బాధపడేవారికి గుండె సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం రెండింతలు ఉంటుందని మరొక అధ్యయనం సూచిస్తుంది.
జర్నల్ ఆఫ్ న్యూరాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనంలో, మైగ్రేన్‌కు సకాలంలో చికిత్స చేయకపోతే, అది ఇస్కీమిక్ స్ట్రోక్‌కు దారితీస్తుందని, ఇది ప్రాణాంతకమైన దుష్ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారు తగిన చికిత్స కోసం ఖచ్చితంగా ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తుంది..?
మైగ్రేన్ అనేది టెన్షన్ కు సంబంధించింది. మైగ్రేన్ పెయిన్ కొంతమందికి యుక్తవయస్సులో తలెత్తుతుంది. 35 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోంది. ఇది కొందరిలో హార్మోన్ల ప్రభావాల కారణంగా కూడా వస్తుంది. కొందరికి నిద్రలేమి కారణంగా కూడా మైగ్రేన్ సమస్య తలెత్తుతుంది.
మైగ్రేన్‌ను ఎలా నివారించాలి.. ?
చలికి సున్నితంగా ఉండేవారిలో మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, శీతాకాలంలో తలనొప్పిని, ముఖ్యంగా మైగ్రేన్‌ను నివారించడానికి చలిగాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అంతేకాదు ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల సమస్య కొంతమేర తగ్గుతుంది. ఎందుకంటే వ్యాయామం సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా మైగ్రేన్ పెయిన్ కూడా తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
