Pimples : ముఖంపై పదే పదే మొటిమలు వేధిస్తున్నాయా..? ఐతే లోపం చర్మంలో కాదు, శరీరంలోనే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ముఖం మీద ఒకటి, రెండు మొటిమలు వస్తే వయసు ప్రభావం అనుకుని సరిపెట్టుకుంటాం. కానీ అవి తరచుగా, విపరీతంగా వస్తుంటే మాత్రం కచ్చితంగా అప్రమత్తం కావాల్సిందే. ఎందుకంటే మొటిమలు (Acne) కేవలం చర్మ సమస్య మాత్రమే కాదు, మన శరీరంలో జరుగుతున్న అనేక అంతర్గత మార్పులకు, ఆరోగ్య సమస్యలకు అవి ఒక సంకేతం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తు న్నారు. కేవలం మురికి వల్లే మొటిమలు వస్తాయనుకోవడం అపోహ మాత్రమే. దీని వెనుక హార్మోన్లు, జీవనశైలికి సంబంధించిన సంక్లిష్టమైన కారణాలు అనేకం ఉన్నాయి.

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

అసలు మొటిమలు ఎలా ఏర్పడతాయి..?

మన చర్మం లోపల ఉండే నూనె గ్రంథులు (Sebaceous glands) ముఖాన్ని తేమగా ఉంచేందుకు సెబమ్ (Sebum) అనే నూనె లాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఎప్పుడైతే ఈ గ్రంథులు అధికంగా నూనెను ఉత్పత్తి చేస్తాయో, ఆ నూనె చర్మం మీది మృత కణాలతో (Dead cells) కలిసి చర్మ రంధ్రాలను మూసివేస్తుంది. గాలి చొరబడని ఈ మూసుకుపోయిన రంధ్రాలలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. అప్పుడు మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఆ బ్యాక్టీరియాతో పోరాడే క్రమంలో అక్కడ వాపు (Inflammation) ఏర్పడుతుంది. ఫలితంగా ఎర్రటి, నొప్పి కలిగించే, చీముతో కూడిన మొటిమలు ఏర్పడతాయి.

హార్మోన్ల హెచ్చుతగ్గులే ప్రధాన కారణం..

మొటిమలకు అతిపెద్ద కారణం శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులే. టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆండ్రోజెన్ హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల నూనె గ్రంథులు చురుకుగా మారి ఎక్కువగా సెబమ్‌ను ఉత్పత్తి చేస్తాయి. నెలసరి సమయం, గర్భధారణ, మెనోపాజ్ లేదా పీసీఓఎస్ (PCOS) వంటి సమస్యలతో బాధపడే మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా మొటిమలు విపరీతంగా వస్తుంటాయి.

మొటిమల ముప్పును పెంచే అలవాట్లు ఇవే..

ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు చర్మ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉండే ఆహారాలు, బేకరీ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్, ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడం. తగినంత నిద్ర లేకపోవడం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, ధూమపానం లాంటి అలవాట్లు శరీరంలో వాపును (Inflammation) పెంచి మొటిమలకు దారితీస్తాయి.

ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు..!

మొటిమలు రాగానే వాటిని చేత్తో గిల్లడం, చిదపడం అస్సలు చేయకూడదు. దీనివల్ల ఇన్ఫెక్షన్ చర్మం అంతటా వ్యాపించి మచ్చలు, గుంతలు పడే ప్రమాదం ఉంది. ముఖాన్ని పదే పదే సబ్బులు, ఫేస్‌వాష్‌లతో కడగడం, గట్టిగా స్క్రబ్ చేయడం వల్ల చర్మం మరింత పొడిబారి నష్టం జరుగుతుంది. డాక్టర్ల సలహా లేకుండా మెడికల్ షాపుల్లో దొరికే స్టెరాయిడ్ క్రీములను సొంతంగా వాడకూడదు.

నివారణ ఎలా..?

మొటిమలను అదుపులో ఉంచుకోవడానికి ముఖాన్ని మృదువైన క్లెన్సర్‌తో రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి. ఆకుకూరలు, తాజా పండ్లు, తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. ఒకవేళ మొటిమలు తీవ్రంగా ఉండి, నొప్పిగా అనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణులను (Dermatologist) సంప్రదించి తగిన క్రీములు లేదా యాంటీబయాటిక్ మందులు వాడటం ఉత్తమమని చెబుతున్నారు డాక్టర్లు.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.