డీహైడ్రేషన్ కు గురైతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
సాక్షి లైఫ్ : ప్రతి జీవికి పీల్చేగాలి తర్వాత అత్యంతగా అవసరమైంది ఏదైనా ఉంది అంటే అది నీరే. మనిషి ఏమీ తినకుండా ఎనిమిదివారాల పాటు బతుకగలడు. కానీ అన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా వేళకు నీళ్లు ఖచ్చితంగా తాగాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం..ఎండాకాలంలో మనశరీరం డీహైడ్రేషన్ కు గురైందని ఎలా గుర్తించాలి..? ఆ సమయంలో లక్షణాలు..ఎలా ఉంటాయి..?
దీర్ఘకాలిక రోగాలతో..
ప్రస్తుతం రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇంట్లోనే కూర్చున్నా, బయటకు వెళ్లకపోయినా..చాలామంది డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలున్నాయి. నీరు అనేది మనిషికి ప్రాణాధారమైంది. కొంతమంది తొందరగా డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. బయట పనిచేసే వ్యక్తులు అంటే వెల్డర్లు, భవన నిర్మాణ కార్మికులు, మెకానిక్స్, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు, క్రీడాకారుల విషయంలో రన్నర్లు, సైక్లిస్టులు, సాకర్ ప్లేయర్స్ ,శిశువులు, చిన్న పిల్లలు, ఎత్తైన ప్రదేశాలలో నివసించే వాళ్ళశరీరంలో ఎక్కువగా నీటిశాతం తగ్గే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఎక్కువగా చెమట..
అసలు ఈ సమస్య ఎలా తలెత్తుతుందంటే..? ఎక్కువగా చెమట, మూత్రవిసర్జన వల్ల శరీరం క్రమం తప్పకుండా నీటిశాతం తగ్గుతుంది. ఆ సమయంలో బాడీకి అవసరమైన నీటిని అందించాలి లేకపోతే, ఒంట్లో నీటిశాతం తగ్గి డీ హైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. శరీరం సాధారణం కంటే ఎక్కువ నీటిని కోల్పోతే నిర్జలీకరణ లేదా డీహైడ్రేషన్ బారీన పడాల్సివస్తుంది.
జీవనాధారమైన నీరు మానవుడి శరీరంలోని ఇతర అవయవాల పనితీరును మెరుగుపరచడంతో పాటు న్యూట్రిషన్స్‌ను సరఫరా చేస్తుంది. మనం తాగే నీరు కంటే ఎక్కువ స్థాయిలో శరీరం నుంచి నీరు బయటకు వెళ్తే ప్రమాదం పొంచి ఉన్నట్లు భావించాలి. శరీరంలో ఉండాల్సిన దానికంటే నీటి శాతం తగ్గిపోతే "డీహైడ్రేషన్" కు గురైనట్లే.
ఓఆర్ఎస్..
ఒక వ్యక్తి డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు వెంటనే ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇస్తారు. తద్వారా సదరు వ్యక్తి శరీరంలో నీటిశతం పెరుగుతుంది. ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వడం ద్వారా ఆయా వ్యక్తులను డీహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడొచ్చు. ముఖ్యంగా శరీరంలో నీటికొరతను అధిగమించేందుకు ఓఆర్ఎస్ ఔషధంలా పని చేస్తుంది.
శరీరంలో నీటి శాతం తగ్గితే..
మానవ శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. సాధారణంగా మనిషి తన శరీరంలో 2 శాతం నీటిస్థాయి కొరత ఉంటే దాహార్తికి గురువుతాడు. ఇంకో స్థాయి పెరిగి 3 శాతం నీటి కొరత ఏర్పడితే హ్యూమాన్ బాడీలో బర్నింగ్ ప్రారంభమవుతుంది. అది మెల్లగా ఆకలి స్థాయిని మందగింపజేస్తుంది. సదరు వ్యక్తి చర్మం ఎర్రగా మారి, బాడీ ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది.
ఈ పరిస్థితులు కేవలం 4 శాతం నీటి స్థాయి కొరత ఉంటేనే, ఇక 5 శాతానికి కొరత ఉంటే ఆ వ్యక్తికి జ్వరం రావడంతో పాటు తలనొప్పి మొదల వుతుంది. నీటికొరత స్థాయి 5 నుంచి 8కి చేరితే మూర్ఛ పోయే ప్రమాదం ఉంది. అదే 20 శాతానికి చేరితే ఆ వ్యక్తి ప్రాణాలకే ముప్పు వాటిల్ల వచ్చు. కాబట్టి ప్రాణాధారమైన నీటిని తాగడం ప్రతీ ఒక్కరూ ప్రాథమిక కర్తవ్యంగా భావించాలి.
మూత్రవిసర్జన..
డీహైడ్రేషన్ లక్షణాలు ఎలా వుంటాయంటే..? మూత్రవిసర్జన తగ్గుతుంది. తలనొప్పి, నిద్ర వచ్చినట్లు అనిపించడం తోపాటు నీరసంగా ఉంటుంది. చర్మంలో సాగే గుణం తగ్గుతుంది. నోరు,పెదవులు, చిగుళ్ళు, నాసికా రంధ్రాలు పొడిబారిపోతాయి.
ఇది కూడా చదవండి.. రిఫ్రిజిరేటర్ లో ఏమేం ఆహార పదార్థాలు ఉంచకూడదంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
