Health Risks : ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత తరంలో రీమేక్ ఫుడ్ ట్రెండ్ నడుస్తోంది. ఉదయం వండిన కూరను మధ్యాహ్నానికి, రాత్రికి మిగిలిన అన్నాన్ని మరుసటి రోజు ఉదయానికి వేడి చేసుకుని తినడం ఇప్పుడు ప్రతి ఇంట్లో దాదాపు సర్వసాధారణమైపోయింది. వేడి చేస్తే బ్యాక్టీరియా చనిపోతుంది కదా, ఎలాంటి ప్రమాదం ఉండదన్నది చాలామంది అపోహ. కానీ, ఒకే ఆహారాన్ని మాటిమాటికీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అంటే ఆహారం విషతుల్యమయ్యే ముప్పు పెరుగుతుందని గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

అసలు సమస్య ఎక్కడంటే..? 

ఆహారాన్ని వేడి చేయడంలో తప్పు లేదు కానీ, వేడి చేసిన ప్రతిసారీ దాన్ని చల్లబరిచి నిల్వ చేసే విధానంలోనే అసలు ముప్పు దాగి ఉంది. వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచినప్పుడు సాల్మొనెల్లా (Salmonella), ఈ-కోలి (E. coli) వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు వేగంగా వృద్ధి చెందుతాయి. దాన్ని వేడి చేసి, మళ్లీ బయటపెట్టి చల్లార్చిన ప్రతిసారీ ఈ బ్యాక్టీరియా పెరగడానికి మనం మరింత అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.

బాగా వేడి చేసినా చావని టాక్సిన్స్.. 

ఆహారంలో పెరిగే కొన్ని రకాల బ్యాక్టీరియాలు హానికరమైన విషతుల్యాలను (Toxins) విడుదల చేస్తాయి. ఆహారాన్ని పొగలు వచ్చేలా వేడి చేసినా సరే ఈ టాక్సిన్స్ నశించవు. అంటే, బ్యాక్టీరియా చనిపోయినా వాటి విషప్రభావం అలాగే ఉండిపోతుంది. ముఖ్యంగా మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసినప్పుడు ఆహారం అంతటా వేడి సమానంగా వ్యాపించదు. దీనివల్ల వేడి తగలని చోట బ్యాక్టీరియా సజీవంగానే ఉండిపోయి అనారోగ్యానికి దారితీస్తుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇలాంటి కలుషితమైన ఆహారం తినడం వల్ల వికారం, వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు, జ్వరం, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్త విరేచనాలు, విపరీతమైన కడుపునొప్పి ఉంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఆరోగ్యం కోసం పాటించాల్సిన జాగ్రత్తలు..

రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లోకి.. వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద గంటల కొద్దీ ఉంచకూడదు. వండిన రెండు గంటల్లోపు ఫ్రిజ్‌లో భద్రపరచాలి. వెడల్పాటి పాత్రలు..ఆహారం త్వరగా చల్లబడటం కోసం లోతు తక్కువగా ఉండే వెడల్పాటి గిన్నెల్లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది.

ఉష్ణోగ్రత.. ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎప్పుడూ 4°C డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి.  ఫ్రిజ్ నుంచి తీసిన ఆహారం మొత్తాన్ని కాకుండా, ఆ పూటకు ఎంత అవసరమో అంతే విడిగా తీసి వేడి చేసుకోవాలి. ఒకసారి వేడి చేసిన ఆహారాన్ని మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టడం, మరుసటి పూట మళ్లీ వేడి చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. ఆహారం మిగిలిపోయినప్పుడు పారేయకుండా వాడుకోవడం మంచిదే కానీ, ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.