Severe Brain Stroke : మాట తడబబడినా.. ముఖం వంకరపోతున్నా.. సివియర్ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలేనా..?
సాక్షి లైఫ్ : గుండెపోటు తరహాలోనే బ్రెయిన్ స్ట్రోక్ (paralysis) కూడా ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక మరణాలకు దారితీస్తున్న సమస్యల్లో ఇది రెండో స్థానంలో ఉంది. ఏటా 1.2 కోట్ల మంది స్ట్రోక్ బారిన పడుతుండగా.. సుమారు 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడినా, చాలామందిలో శాశ్వత వైకల్యం (paralysis) ఏర్పడే ప్రమాదం ఉంది. స్ట్రోక్ అనేది ఒక అత్యవసర వైద్య పరిస్థితి. చికిత్సలో జరిగే ప్రతి నిమిషం జాప్యం రోగి పాలిట ప్రాణాంతకంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ప్రధాన లక్షణాలు - నిర్లక్ష్యం తగదు..
చాలామంది స్ట్రోక్ తొలి దశ లక్షణాలను వయసు పైబడటం వల్ల వచ్చిన నీరసంగా లేదా సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే ఇంటి చిట్కాలు పాటిస్తూ కాలయాపన చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
ముఖం అకస్మాత్తుగా ఒకవైపునకు వంకరపోవడం.
చేతులు లేదా కాళ్లలో హఠాత్తుగా తీవ్రమైన నీరసం రావడం, లేదా స్పర్శ కోల్పోవడం.
మాట తడబడటం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం.
శరీర సమతుల్యత కోల్పోయి నడవలేకపోవడం.
స్ట్రోక్.. రెండు రకాలు..
ఎయిమ్స్ (AIIMS) న్యూరోసైన్స్ విభాగానికి చెందిన నిపుణులైన డాక్టర్ శైలేష్ బి. గైక్వాడ్ వివరణ ప్రకారం.. మెదడుకు రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడటం వల్లే స్ట్రోక్ వస్తుంది. ఇది ప్రధానంగా రెండు రకాలు.. ఇస్కీమిక్ స్ట్రోక్ (Ischemic Stroke)..రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, మెదడులోని నిర్దిష్ట భాగానికి రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోతుంది. హెమరేజిక్ స్ట్రోక్ (Hemorrhagic Stroke)..మెదడులోని రక్తనాళం చిట్లిపోయి రక్తస్రావం జరుగుతుంది. ఈ రెండు రకాలకు చికిత్సా విధానాలు వేర్వేరుగా ఉంటాయి.
ముప్పు ఎవరికి ఎక్కువ..?
అధిక రక్తపోటు (high blood pressure ), మధుమేహం (diabetes), పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలు( cholesterol levels), గుండె జబ్బులు ఉన్నవారు స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువ. వీటితో పాటు ధూమపానం, స్థూలకాయం (obesity), శారీరక శ్రమ లేకపోవడం వంటి జీవనశైలి లోపాలు ముప్పును మరింత పెంచుతాయి.
గోల్డెన్ అవర్.. సకాలంలో చికిత్సతో ప్రాణదానం..
లక్షణాలు కనిపించిన వెంటనే రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తే, వైద్యులు ముందుగా సీటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ (MRI) ద్వారా స్ట్రోక్ రకాన్ని నిర్ధారిస్తారు. ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చిన రోగులకు లక్షణాలు మొదలైన నాలుగున్నర గంటల లోపు (4.5 hours) రక్తం గడ్డకట్టడాన్ని కరిగించే మందులు ఇస్తారు. పరిస్థితిని బట్టి మెకానికల్ థ్రోంబెక్టమీ (Mechanical Thrombectomy) అనే ప్రక్రియ ద్వారా గడ్డకట్టిన రక్తాన్ని తొలగిస్తారు. దీన్ని 24 గంటల లోపు చేస్తే సత్ఫలితాలు ఉంటాయి.
హెమరేజిక్ స్ట్రోక్ ((bleeding in the brain) కేసుల్లో తక్షణమే రక్తపోటును అదుపు చేసి, అవసరమైతే సర్జరీ ద్వారా చికిత్స అందిస్తారు. మెదడుకు సంబంధించిన ఈ సమస్యలో ప్రతి నిమిషం అమూల్యమైనదే. సకాలంలో సరైన చికిత్స అందిస్తే రోగి ప్రాణాలను కాపాడటమే కాకుండా వైకల్యం రాకుండా అడ్డుకోవచ్చు.
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
