El Nino’s Impact on Health : ఆరోగ్యంపై ‘ఎల్నినో’ పంజా.. మౌనంగా దెబ్బతింటున్న కీలక అవయవాలు..!
సాక్షి లైఫ్ : వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు, ముఖ్యంగా ‘ఎల్నినో’ ప్రభావంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతున్నాయి. ఎండ తీవ్రత వల్ల కేవలం వడదెబ్బ తగలడమే కాకుండా, శరీరంలోని కీలక అవయవాలు క్రమంగా దెబ్బతింటున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఎండలో తిరిగితే వడదెబ్బ తగులుతుందని అందరికీ తెలుసు. కానీ, ఎల్నినో వల్ల పెరుగుతున్న వేడి శరీరంలోని అవయవాలపై నెమ్మదిగా, తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. కోవిడ్ లాంటి వైరస్ల ప్రభావం దీర్ఘకాలం పాటు ఎలా ఉంటుందో, ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల జరిగే నష్టం కూడా వెంటనే బయటపడకుండా నెలలు లేదా ఏళ్ల తర్వాత కిడ్నీలు, గుండె, నాడీ వ్యవస్థల వైఫల్యంగా బయటపడుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
కిడ్నీలపై తీవ్ర ముప్పు..
మన శరీరంలో నీరు, లవణాల శాతాన్ని సమతుల్యం చేయడంలో కిడ్నీలది కీలక పాత్ర. విపరీతమైన ఎండల వల్ల శరీరంలోని నీరు, లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దీంతో సూక్ష్మ స్థాయిలో కిడ్నీలు దెబ్బతిని, కాలక్రమంలో వాటి పనితీరు మందగిస్తుంది.
శ్రామికులకు పొంచి ఉన్న ప్రమాదం..
హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో రోజంతా ఎండలో పనిచేసే నిర్మాణ కార్మికులు, ట్రాఫిక్ పోలీసులు, డెలివరీ బాయ్స్, వీధి వ్యాపారులపై ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనికి నగర కాలుష్యం కూడా తోడవడంతో ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది.
రాత్రిళ్లు సైతం వేడిగాలులే..
ప్రస్తుత రోజుల్లో ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతోంది. రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత, వేడిగాలులు తగ్గకపోవడంతో శరీరానికి తగిన విశ్రాంతి దొరకడం లేదు. ఇది రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది.
తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు..
దాహం వేసినా, వేయకపోయినా ప్రతిసారీ తగినంత నీరు తాగుతూనే ఉండాలి. లేత రంగులో ఉండే, వదులైన కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 6:30 గంటల మధ్య ఆరుబయట వాకింగ్, వ్యాయామాలు, కఠినమైన పనులు చేయడం మానుకోవాలి. ఎండలో పనిచేసేవారు ద్రవాహారం, ఓఆర్ఎస్ (ORS) వంటివి తీసుకోవాలి. ఆస్పత్రుల్లో డీహైడ్రేషన్, వడదెబ్బ కేసులను ఎదుర్కొనేందుకు తగిన మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
