ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి లోదుస్తులు ధరించాలి..?
సాక్షి లైఫ్ : బిగుతుగా ఉండే లోదుస్తులు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి..? ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి లోదుస్తులను ఎంచుకోవాలి..? అండర్ వేర్.. ఫాన్సీగా, అందంగా ఉండాలని కోరుకుంటారు కొందరు. దీనివల్ల ప్రయోజనాలకంటే దుష్ప్రభావాలే ఎక్కువని వెల్లడిస్తున్నాయి పలు పరిశోధనలు. లోదుస్తులు అందంగా, ఫాన్సీగా ఉండవలసిన అవసరం లేదు. వేసుకున్న ప్పుడు సౌకర్యవంతంగా ఉంటే సరిపోతుంది. కొంచెం టైట్ సైజ్ అయినా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. లోదుస్తుల ఎంపిక విషయంలో ఫాబ్రిక్ , సౌకర్యంపై మాత్రమే శ్రద్ధ వహించాలి. అయితే ప్రస్తుతం షేప్ వేర్ వేసుకోవడంతో పాటు పర్ఫెక్ట్ షేప్ రావాలంటే బిగుతుగా ఉండే లోదుస్తులు కూడా వేసుకోవడం మొదలుపెట్టారు కొందరు. మరికొందరు బరువు పెరిగిన తర్వాత రకరకాల సైజుల బట్టలు వేసుకుంటున్నారు.
కానీ లోదుస్తుల విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. కొందరు ఖరీదైన లోదుస్తులంటే ఇష్టపడుతారు. వాటి ఆకర్షణను వదులుకోలేక సైజ్ సరిపోకపోయినా వాటినే వాడుతున్నారు. అయితే ఈ చిన్నపాటి అజాగ్రత్త వల్ల చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మీకు తెలుసా..?
చర్మంపై ఒత్తిడి..
చాలా బిగుతుగా ఉండే లోదుస్తులను ధరించడం వల్ల పెల్విక్ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాన్ని పీల్చుకోవచ్చు. దీని కారణంగా నొప్పితో పాటు తీవ్రమైన దురద కూడా వస్తుంది. ఇది సకాలంలో సరిదిద్దకపోతే, గాయంగా మారుతుంది. ప్రైవేట్ భాగాలే కాకుండా నడుముపై కూడా మచ్చలు ఏర్పడతాయి. ఇలా మచ్చలతో మొదలై ఒక్కోసారి అవి పుండ్లు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
రక్త ప్రసరణ..
బిగుతుగా ఉండే లోదుస్తులను ధరిస్తే, అది తొడల పైభాగంలో రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. దీని కారణంగా తొడతో పాటు ఇతర అవయవాల పనితీరు దెబ్బతింటుంది. రక్తప్రసరణ సక్రమంగా జరగకపోవడం వల్ల పాదాలు మొద్దుబారవచ్చు. దీనిని తేలికగా తీసుకుంటే నడక కూడా కష్టమవుతుంది.
బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్..
టైట్ అండర్ వేర్ ధరించడం వల్ల ప్రైవేట్ ప్రాంతంలో గాలి సరిగా తగలదు. దీని కారణంగా చెమట ఎక్కువగా పడుతుంది. అది త్వరగా ఎండిపోకపోవడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది.
యాసిడ్ రిఫ్లక్స్ సమస్య..
అంతేకాదు బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల పొట్ట కూడా బిగుతుగా ఉంటుంది. దీని వల్ల ఎసిడిటీ సమస్య రావచ్చు. అందువల్ల బిగుతుగా ఉండే లోదుస్తులను కాకుండా సౌకర్యవంతంగా ఉండే లోదుస్తులు ధరించడం ఉత్తమం..
ఇది కూడా చదవండి.. మధుమేహ ముప్పును తగ్గించే ఆహారం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.