ఎలాంటి అలవాట్లు గుండె ఆరోగ్యానికి హానికరం..?
సాక్షి లైఫ్: గుండె జబ్బుల ప్రమాదం కాలక్రమేణా వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు యువకులు కూడా గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో గుండె జబ్బులు ఒకటని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల ప్రభావం గుండె ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. గుండె ను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సరైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదాల గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి, నివారణ పద్ధతుల గురించి వారికి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
కొంతమంది తెలిసి, తెలియక గుండెకి హాని కలిగించే అనేక చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. 20 ఏళ్లలోపు వారిలో కూడా గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తడానికి ఇదే కారణం.
గుండె జబ్బులు..
మెరుగైన జీవనశైలి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుంది. మహిళల్లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదంపై జరిపిన ఒక అధ్యయనంలో ఆరోగ్యకరమైన బరువు, ధూమపానం చేయని, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే ,ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్న మహిళలకు గుండెపోటు లేదా గుండె జబ్బులతో మరణించే ప్రమాదం 83 శాతం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పురుషులలో ఇదే విధమైన అధ్యయనంలో ఫలితాలు దాదాపు ఒకేలా ఉన్నాయి.
సిగరెట్లు, గుట్కాలు, పొగాకు ఉత్పత్తుల వినియోగం ముఖ్యంగా వాటి నుంచి వెలువడే పొగ గుండె, ధమనులకు చాలా హాని కలిగిస్తుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానం మానేయడం ద్వారా, గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కాబట్టి ధూమపానం చేసే వాళ్ళు మానేయడం ఉత్తమం.
శారీరక శ్రమ..
వ్యాయామం, శారీరక శ్రమ గుండె జబ్బులు, అనేక ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఎంత శారీరకంగా చురుకుగా ఉంటే, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని అంతగా తగ్గిస్తుంది. రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే చాలా మంచిదని వైద్యనిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ లేనివారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.
బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అధిక శరీర బరువు, ముఖ్యంగా బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు, గుండెపై ఒత్తిడి తెస్తుంది. మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది.
ఇది కూడా చదవండి..బ్లాక్ సాల్ట్ బెనిఫిట్స్ ఎన్నో..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
