World Osteoporosis Day : క్యాల్షియం మాత్రలు వేసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయా..?
సాక్షి లైఫ్ : ఎముకలు దృఢంగా ఉండాలంటే ముందుగా గుర్తొచ్చేది క్యాల్షియం. ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజుకు సుమారు 1000 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం. అయితే, చాలామంది ఎముకల నొప్పులు రాగానే సొంతంగా క్యాల్షియం మాత్రలు వేసుకోవడం మొదలుపెడతారు. మరి కేవలం ఈ సప్లిమెంట్ల ద్వారా 'ఆస్టియోపోరోసిస్' (Osteoporosis) లాంటి తీవ్రమైన ఎముకల వ్యాధులను నివారించవచ్చా..? ఆస్టియోపోరోసిస్ కు సంబంధించిన ముఖ్యమైన వాస్తవాలను గురించి ఇప్ప్పుడు తెలుసుకుందాం..
అసలు ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి..?
ఇది ఎముకల సాంద్రతను తగ్గించి, వాటిని పెళుసుగా మార్చే ఒక నిశ్శబ్ద వ్యాధి (Silent Disease). ఇది ఉన్నవారిలో ఎముకలు లోపల గుల్లగా మారిపోతాయి. దీనివల్ల చిన్న దెబ్బ తగిలినా, కాలు జారి కింద పడినా ఎముకలు సులువుగా విరిగిపోయే (fracture) ప్రమాదం ఉంటుంది. వ్యాధి తీవ్రమయ్యే వరకు, ఫ్రాక్చర్ జరిగే వరకు చాలామందికి ఈ సమస్య ఉన్నట్లు తెలియదు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఎముకలు ఎందుకు బలహీనపడతాయి..?
వయసు, హార్మోన్లు: వయసు పైబడే కొద్దీ సహజంగానే ఎముకల సాంద్రత తగ్గుతుంది. ముఖ్యంగా మహిళల్లో 'మెనోపాజ్' తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పడిపోవడం వల్ల ఎముకల నష్టం వేగంగా జరుగుతుంది. ఎముకలకు క్యాల్షియం ఎంత అవసరమో, ఆ క్యాల్షియం శరీరానికి వంటపట్టాలంటే 'విటమిన్-డి' కూడా అంతే అవసరం. వీటి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి.
శారీరక శ్రమ లేకపోవడం.. గంటల తరబడి కూర్చుని పనిచేయడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కండరాలు, ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారిలో దీర్ఘకాలం పాటు స్టెరాయిడ్ మందులు వాడేవారిలో ఈ ముప్పు ఎక్కువ.
క్యాల్షియం మాత్రలతో ముప్పు తప్పుతుందా..?
క్యాల్షియం మాత్రలు వేసుకుంటే ఆస్టియోపోరోసిస్ రాదని అనుకోవడం ఒక అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆహారం ద్వారా తగినంత క్యాల్షియం లభించని వారికి మాత్రమే డాక్టర్లు సప్లిమెంట్లను సూచిస్తారు. సొంత వైద్యంతో ఇష్టానుసారం క్యాల్షియం మాత్రలు మింగితే, ఒంట్లో మోతాదుకు మించి అది పేరుకుపోయి కిడ్నీ స్టోన్స్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎముకల ఆరోగ్యం అనేది సరైన జీవనశైలి, పోషకాహారం మీద ఆధారపడి ఉంటుంది కానీ, కేవలం మాత్రల మీద కాదు.
ఎముకల పటిష్టతకు మార్గాలివే..
ఆస్టియోపోరోసిస్‌ను ముందుగానే అడ్డుకోవాలంటే చిన్న వయసు నుంచే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.. సరైన ఆహారం.. పాలు, పెరుగు, పనీర్, ఆకుకూరలు, నువ్వులు, రాగులు వంటి క్యాల్షియం అధికంగా ఉండే సహజ ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలి. సూర్యరశ్మి.. శరీరానికి విటమిన్-డి అందాలంటే ఉదయం పూట ఎండలో కాసేపు నిలబడటం లేదా నడవడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం..నడక, మెట్లు ఎక్కడం, బరువులు ఎత్తే (strength training) వ్యాయామాలు చేయడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. ధూమపానం, మద్యపానం ఎముకల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. వీటికి వీలైనంత దూరంగా ఉండాలి.
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
