Prediabetes : ప్రీ-డయాబెటిస్ వస్తే.. మధుమేహం ఖాయమా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్యల్లో మధుమేహం (Diabetes) ముందు వరుసలో ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పే ఈ వ్యాధి.. దీర్ఘకాలంలో కళ్లు, కిడ్నీలు, కాలేయం, గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే, మధుమేహం గురించి మాట్లాడేటప్పుడు 'ప్రీ-డయాబెటిస్' (Pre-Diabetes) అనే పదం తరచుగా వినిపిస్తుంటుంది. ప్రీ-డయాబెటిస్ ఉంటే కచ్చితంగా షుగర్ వ్యాధి వస్తుందా? దీన్ని ముందే ఎలా గుర్తించి అడ్డుకోవాలి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

ప్రీ-డయాబెటిస్..

శరీరం 'ఇన్సులిన్'ను సరిగ్గా వినియోగించుకోలేనప్పుడు రక్తంలో గ్లూకోజ్ (sugar) స్థాయిలు పెరుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి, టైప్-2 డయాబెటిస్ స్థాయికి చేరకముందు ఉండే దశనే 'ప్రీ-డయాబెటిస్' అంటారు. ఇది మధుమేహానికి ముందస్తు హెచ్చరిక లాంటిది. అమెరికన్ ఆరోగ్య సంస్థ సీడీసీ (CDC) నివేదికల ప్రకారం.. ఈ దశలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్రమైన ముప్పులకు దారితీస్తుంది.

లక్షణాలు - ఎవరికి ముప్పు ఎక్కువ..?

ప్రీ-డయాబెటిస్ దశలో స్పష్టమైన లక్షణాలు పెద్దగా కనిపించకపోవచ్చు. అయితే విపరీతమైన దాహం, తరచుగా మూత్రవిసర్జన, ఎప్పుడూ అలసటగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. 

ఇలాంటి లక్షణాలు లేదా అలవాట్లు ఉన్నవారికి ముప్పు ఎక్కువ.

కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే జన్యుపరంగా వస్తుంది. అధిక బరువు ఉండటం, శారీరక శ్రమ ఏమాత్రం లేకపోవడం. గర్భధారణ సమయంలో మధుమేహం (Gestational Diabetes) బారిన పడిన మహిళలకు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లేదా హెచ్‌బీఏ1సీ (HbA1c) రక్త పరీక్ష ద్వారా దీనిని నిర్ధారిస్తారు. హెచ్‌బీఏ1సీ స్థాయిలు 5.7 నుంచి 6.4% మధ్య ఉంటే వారిని ప్రీ-డయాబెటిక్‌గా పరిగణిస్తారు.

మధుమేహంగా మారకుండా.. ఈ జాగ్రత్తలు.. 

ప్రీ-డయాబెటిస్ ఉందంటే భవిష్యత్తులో కచ్చితంగా డయాబెటిస్ వస్తుందని అర్థం కాదు. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ముప్పును సులభంగా తిప్పికొట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. దీనికోసం అన్నం, రోటీలు పూర్తిగా మానేసి కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ భోజనం పళ్లెంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అవసరానికి మించి అతిగా తినడం మానుకోవాలి.

తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. బదులుగా పీచుపదార్థాలు (fiber), ముడి ధాన్యాలు మిల్లెట్స్, ఓట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. కండరాలు ఇన్సులిన్‌ను సమర్థవంతంగా వాడుకోవాలంటే వ్యాయామం తప్పనిసరి. వారంలో కనీసం 150 నిమిషాల పాటు, రోజూ అరగంట చొప్పున బ్రిస్క్ వాక్ లేదా ఇతర వ్యాయామాలు చేయాలి. మీ శరీర బరువులో కనీసం 5 నుంచి 7 శాతం తగ్గగలిగినా మధుమేహం ముప్పును గణనీయంగా నివారించవచ్చు.

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.