Constipation : గ్యాస్, మలబద్ధకం పదే పదే వేధిస్తున్నాయా..? మీ పేగుల ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..!
సాక్షి లైఫ్ : మన శరీరంలో జీర్ణవ్యవస్థది అత్యంత కీలక పాత్ర. మనం తీసుకున్న ఆహారాన్ని అరిగించి, అందులోని పోషకాలను శరీరానికి అందించి, వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపేది పేగులే. ఈ పేగుల ఆరోగ్యం ఏమాత్రం దెబ్బతిన్నా అనేక రకాల ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటివి అప్పుడప్పుడూ వస్తుంటే వాతావరణ లేదా ఆహార మార్పులని సరిపెట్టుకోవచ్చు. కానీ.. తరచూ ఈ సమస్యలు వేధిస్తుంటే మాత్రం వాటిని ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. అవి పేగుల పనితీరు మందగించిందనడానికి సంకేతాలు కావొచ్చు.
కేవలం లక్షణాలను బట్టి వ్యాధిని అంచనా వేయలేకపోయినా, మీలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే పేగుల ఆరోగ్యం పట్ల అప్రమత్తం కావాల్సిందే..!
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
వదలని మలబద్ధకం..
ఉదయాన్నే కడుపు సాఫీగా లేకపోవడం, మలవిసర్జన కష్టంగా, ఇబ్బందికరంగా మారడం పేగుల అనారోగ్యానికి తొలి సంకేతం. శరీరానికి తగినంత నీరు అందకపోవడం, పీచుపదార్థాలు (Fiber) లేని జంక్ ఫుడ్ తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్లే ప్రధానంగా ఈ సమస్య వస్తుంది.
తరచూ విరేచనాలు..
పదే పదే నీళ్ల విరేచనాలు అవుతున్నాయంటే పేగుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందేమో అని అనుమానించాలి. లేదా పడని ఆహారం తీసుకున్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది. విరేచనాల వల్ల శరీరంలోని నీరంతా బయటకు పోయి డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం ఉంది.
కడుపు ఉబ్బరం, గ్యాస్..
కొద్దిగా తినగానే కడుపు ఉబ్బరంగా, బరువుగా అనిపించడం, గ్యాస్ సమస్య రావడం చాలామందిలో చూస్తుంటాం. జీర్ణక్రియ మందగించినప్పుడు పేగుల్లో చెడు బ్యాక్టీరియా పెరిగిపోయి ఈ రకమైన సమస్య వస్తుంది. ఇది తరచూ బాధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి.
కడుపులో నొప్పులు, తిమ్మిర్లు..
కారణం లేకుండా పొత్తికడుపులో లేదా బొడ్డు చుట్టూ పదే పదే నొప్పి రావడం, కండరాలు పట్టేసినట్లు అనిపించడం పేగుల సమస్యలకు మరో సూచిక. ఇన్ఫెక్షన్లు లేదా మలబద్ధకం తీవ్రత వల్ల ఇలా జరగవచ్చు.
అకస్మాత్తుగా బరువు తగ్గడం..
ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా, డైటింగ్ లాంటివి పాటించకపోయినా వేగంగా బరువు తగ్గుతున్నారంటే.. పేగులు పోషకాలను సరిగ్గా గ్రహించడం లేదని అర్థం చేసుకోవాలి.
అలవాట్లలో మార్పులు..
మీ రోజువారీ మలవిసర్జన సమయాల్లో తీవ్రమైన మార్పులు రావడం, మలం రంగు లేదా ఆకృతిలో నిరంతరం తేడాలు కనిపిస్తుంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇది దీర్ఘకాలిక పేగు వ్యాధులకు సంకేతం కావొచ్చు.
అంతుపట్టని నీరసం, అలసట..
పేగుల సమస్యల వల్ల లోపల ఎక్కడైనా రక్తస్రావం జరుగుతుంటే అది రక్తహీనతకు దారితీస్తుంది. పోషకాలు శరీరానికి సరిగ్గా అందకపోవడం వల్ల చిన్న పనికే అలసిపోవడం, ఎప్పుడూ నీరసంగా అనిపించడం జరుగుతుంది.
పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే..
రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. పీచు పదార్థాలు పేగుల ఆరోగ్యానికి అమృతం లాంటివి. శరీరానికి సరిపడా నీరు..రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు తప్పకుండా తాగాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం చేయాలి. సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. మలంలో రక్తం పడటం, విపరీతమైన కడుపునొప్పి, మలం నల్లగా నల్ల రంగులో రావడం, భరించలేని అలసట.. వంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
