Heart Stent Myths vs Facts : గుండెకు స్టెంట్ ఎప్పుడు అవసరం అవుతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు (Heart Attack), ఇతర హృదయ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో (Blood Vessels) కొవ్వు పేరుకుపోయి, రక్తప్రవాహం ఆగిపోవడమే గుండెపోటుకు ప్రధాన కారణం. సమయానికి లక్షణాలను గుర్తించి, తగిన చికిత్స అందిస్తే రోగి ప్రాణాలను కాపాడుకోవచ్చు. గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడినప్పుడు లేదా అత్యవసరంగా గుండెపోటు వచ్చినప్పుడు వైద్యులు 'స్టెంటింగ్' (Angioplasty with Stenting) చికిత్సను ప్రధానంగా సూచిస్తుంటారు.

అసలు స్టెంటింగ్ అంటే ఏమిటి..?

గుండెలో మూసుకుపోయిన లేదా కుంచించుకుపోయిన రక్తనాళంలోకి ఒక సన్నని క్యాథెటర్ సహాయంతో చిన్న జాలీలాంటి లోహపు గొట్టాన్ని (stent) ప్రవేశపెడతారు. ఇది మూసుకుపోయిన ధమనిని వెడల్పుగా తెరిచి ఉంచుతుంది. దీనివల్ల గుండె కండరాలకు రక్తప్రసరణ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే, స్టెంట్ వేయించుకున్న తర్వాత చాలామంది రోగుల్లో, వారి కుటుంబ సభ్యుల్లో అనేక అపోహలు ఉంటున్నాయి. ఈ చికిత్స తర్వాత గుండె పూర్తిగా నయమైపోయిందని కొందరు, ఇక సాధారణ జీవితం గడపలేమని మరికొందరు భయపడుతుంటారు. ఈ నేపథ్యంలో స్టెంటింగ్ చుట్టూ ఉన్న ప్రధాన అపోహలు-నిజాలపై కార్డియాలజిస్టుల విశ్లేషణ..

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 

అపోహ 1.. స్టెంట్ వేస్తే గుండె సమస్య పూర్తిగా తొలిగిపోయినట్లేనా..?

నిజం.. స్టెంటింగ్ అనేది కేవలం బ్లాక్ అయిన నిర్దిష్ట ధమనిని మాత్రమే తెరుస్తుంది. కానీ శరీరంలోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రక్రియను (Atherosclerosis) అది పూర్తిగా ఆపలేదు. కాబట్టి, స్టెంట్ వేసిన తర్వాత కూడా ఇతర రక్తనాళాల్లో కొత్త బ్లాకేజీలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే భవిష్యత్తులో గుండెపోటు రాకుండా ఉండాలంటే రక్తపోటు (B.P), మధుమేహం (Diabetes) అదుపులో ఉంచుకోవడంతో పాటు కొలెస్ట్రాల్ తగ్గించే మందులను వైద్యుల సలహా మేరకు వాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అత్యవసరం.

అపోహ 2.. స్టెంట్ వేసిన తర్వాత మందులు వాడాల్సిన అవసరం లేదా..?


నిజం..ఇది అత్యంత ప్రమాదకరమైన అపోహ. వైద్యుల అనుమతి లేకుండా మందులు ఆపేస్తే, కొత్తగా వేసిన స్టెంట్‌లో రక్తం గడ్డకట్టే (Stent Thrombosis) ముప్పు చాలా రెట్లు పెరుగుతుంది. ఇది తిరిగి తక్షణ గుండెపోటుకు దారితీయవచ్చు. అందుకే రక్తాన్ని పలచబరిచే యాంటీప్లేట్‌లెట్ మందులను, కొలెస్ట్రాల్‌ను అదుపు చేసే స్టాటిన్లను వైద్యులు సూచించిన కాలం పాటు ఖచ్చితంగా వాడాలి.

అపోహ 3.. స్టెంట్ తర్వాత వ్యాయామాలు అస్సలు చేయకూడదా..?


నిజం..చికిత్స జరిగిన తొలి రోజుల్లో కొంత విశ్రాంతి అవసరమే అయినప్పటికీ, ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో చేసే తేలికపాటి వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కార్డియాక్ రిహాబిలిటేషన్ (Cardiac Rehabilitation) లో భాగంగా రోజూ క్రమం తప్పకుండా చేసే మార్నింగ్ వాక్, తేలికపాటి ఏరోబిక్ వ్యాయామాలు గుండె కండరాలను బలపరుస్తాయి. ఇవి బరువును, బీపీని అదుపులో ఉంచి మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతాయి. అయితే బరువులు ఎత్తడం, కఠినమైన జిమ్ వర్కవుట్లు చేసే ముందు మాత్రం కార్డియాలజిస్ట్ అనుమతి తప్పనిసరి.

అపోహ 4.. స్టెంట్ పడితే ఇక జీవితాంతం రోగిలాగే గడపాలా..?

నిజం.. ఇది కేవలం మానసిక భయం మాత్రమే. స్టెంట్ వేయించుకున్న అత్యధిక శాతం మంది రోగులు కొన్ని వారాల వ్యవధిలోనే తమ దైనందిన పనులకు, ఉద్యోగాలకు హాజరవుతున్నారు. సమతుల్య ఆహారం తీసుకుంటూ, మందులు సక్రమంగా వాడుతున్న వారు సంవత్సరాల తరబడి చురుకైన, సంపూర్ణ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.

సారాంశంలో చెప్పాలంటే... స్టెంట్ అనేది గుండె జబ్బుకు శాశ్వత ముగింపు కాదు, గుండెపోటు ముప్పు నుంచి ప్రాణాలను కాపాడే ఒక సమర్థవంతమైన తాత్కాలిక చికిత్స మాత్రమే. దీర్ఘకాలికంగా గుండె పదిలంగా ఉండాలంటే జీవనశైలి మార్పులు, సమతుల్య ఆహారం, నిరంతర వైద్య పర్యవేక్షణే శ్రీరామరక్ష..!

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.